భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన యోధుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. పాలన చేతగాని కాంగ్రెస్ పాలకులు తెలంగాణ జాతిపిత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోశ్‌రావును సిట్ పేరుతో తరచూ పిలిచి విచారించడంపై మండిపడ్డాయి. పదేళ్లు రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దిన అపర భగీరథుడిపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంపై ఆగ్రహించాయి.
కేసీఆర్‌కు సిట్ విచారణ పేరుతో నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లలో బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.

మణుగూరు టౌన్, జనవరి 30 : కేసీఆర్ కారణజన్ముడని, ఆయన లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదని, కేసీఆర్‌ను ‘సిట్’ పేరుతో భయపెట్టిస్తే భయపడేవాడుకాడని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి మణుగూరులోని అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ కేసీఆర్‌ను జైలుకు పంపించే ప్రయత్నం చేస్తే జైల్‌భరో కార్యక్రమాన్ని చేపడతామని, తాటాకు చప్పుళ్లకు భయపడే వారు లేరన్నారు.
మున్సిపాలిటీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డికి ప్రజలు గట్టిగా బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భూ కుంభకోణం, ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా, డ్రగ్స్ మాఫియా పెచ్చరిల్లుతోందని, బీఆర్ఎస్ నాయకుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ తోక ముడుచుకుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి, అక్రమాలను ప్రశ్నించి ప్రజల పక్షాన నిలబడే కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సిట్ నోటీసులు ఉపసంహరించుకోకపోతే విలువలు కోల్పోతారని అన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపి ప్రపంచానికి చాటిచెప్పిన నాయకుడు కేసీఆర్ అని, సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకొని రాష్ర్టాన్ని చంటిబిడ్డలా చూసుకుంటూ సాగునీటి విప్లవం,
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు వంటి అద్భుత పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప విజనరీ ఉన్న నేత అని కొనియాడారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేసీఆర్‌కు మచ్చ తేవాలని చూస్తే ఊరుకోమన్నారు. సీఐ నాగబాబు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను అడ్డుకున్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పోషం నర్సింహారావు, వట్టం రాంబాబు, అడపా అప్పారావు, యడ్ల శ్రీను, నూకారపు రమేష్, ఏ.నర్సింహారావు, ముద్దంగుల కృష్ణ, రాంకోటి, రంజిత్, రవి, సృజన్ తదితరులు పాల్గొన్నారు.

పాలన చేతకాక తెలంగాణ బాపూజీ, మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధ్ది పొందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసి డ్రామాలు ఆడుతున్నది. అమలు సాధ్యంకాని హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కార్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను పూర్తిగా గాలికొదిలేసింది. కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని తెలంగాణ ప్రజానీకం తీవ్రంగా ఖండిస్తోంది.
-మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి
తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నేతకు కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ చేత నోటీసులు ఇప్పించడం హేయమైన చర్య. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరింపులతో లొంగదీయలేదు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వెన్నంటి ఉన్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్నందునే బీఆర్ఎస్ను రేవంత్‌రెడ్డి టార్గెట్ చేశారు. అయినా అదిరేది, బెదిరేది లేదు.
-తాటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే, అశ్వారావుపేట
ఫోన్ ట్యాపింగ్ పేరుతో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ ద్వారా నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ మొత్తాన్ని అవమానించినట్లే. సంబంధం లేని వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోశ్‌రావును విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేయడం సరికాదు. రెండేళ్ల పాలనలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోంది.
-సున్నం నాగమణి, మాజీ జడ్పీటీసీ, ములకలపల్లి