కొత్తగూడెం సింగరేణి, ఫిబ్రవరి 14 : సింగరేణి ఖాళీ క్వార్టర్లు, కంపెనీ స్థలాలను ఆక్రమించి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని కంపెనీకి భూ సేకరణలో ఇబ్బందులను కలుగజేస్తున్నారని, ఎస్టేట్స్ అధికారులు, సెక్యూరిటీ అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఆక్రమణలను అరికట్టాలని డైరెక్టర్(పా) ఎన్.బలరాం అన్నారు. సోమవారం కంపెనీవ్యాప్త జీఎంలు, సెక్యూరిటీ, ఎస్టేట్స్ డిపార్ట్మెంట్ అధికారులతో హెడ్డాఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏజీఎం సెక్యూరిటీ హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డైరెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సింగరేణి, ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని కీలకమైన ప్రదేశాల్లో సక్రమంగా నియమించడానికి, ప్రస్తుతం ఉన్న సీసీటీవీ కెమెరాల పనితీరు అదేవిధంగా ముఖ్యమైన స్థలాల్లో లాంగ్రేంజ్ సీసీ టీవీ కెమెరాలను అమర్చడం, స్క్రాప్ డిస్పోజల్ చేయడం తదితర అంశాలపై చర్చించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి డైరెక్టర్(ఆపరేషన్స్) చంద్రశేఖర్ మాట్లాడుతూ సింగరేణి ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ విభాగం పాత్ర ఎంతో ముఖ్యమైందని, సెక్యూరిటీ అధికారులు, ఉద్యోగులు విధి నిర్వహణలో క్రమశిక్షణతో మెలిగి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి కంపెనీ ఆస్తులను కాపాడాలని సూచించారు. సమావేశంలో జీఎం ఎస్టేట్స్ వెంకటేశ్వర్‌రెడ్డి, జీఎం ఎంఎస్ సురేశ్‌బాబు, డీజీఎం ఐటీ రాంకుమార్, డీవైజీఎం ఐఈ వెంకయ్య, ఎస్వోఎం సెక్యూరిటీ వేణుమాధవ్, సీనియర్ సెక్యూరిటీ ఆఫసీర్ జాకీర్ హుస్సేన్, కంపెనీవ్యాప్త సెక్యూరిటీ, ఎస్టేట్స్ అధికారులు పాల్గొన్నారు.
సింగరేణీయులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు
కొత్తగూడెం సింగరేణి, ఫిబ్రవరి 14 : సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమం, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తోందని డైరెక్టర్(పా) ఎన్.బలరాం అన్నారు. ఒక సింగరేణి కార్మికుడికి, మరొక సింగరేణి గృహిణికి హైదరాబాద్‌లోని ఫేస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించిన నేపథ్యంలో సోమవారం ఆస్పత్రిలో జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. రామగుండం-2 ఏరియాకు చెందిన కార్మికుడు రాయలింగు, శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన సతీశ్ అనే కార్మికుడి భార్య స్వర్ణలతకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారన్నారు. దీనికోసం సంస్థ రూ.34 లక్షలు మంజూరు చేసిందని, ఆస్పత్రి వైద్యులు సమర్థంగా ఆపరేషన్ నిర్వహించి ప్రాణాలను కాపాడారని ప్రశంసించారు. డాక్టర్లు మధుసూదన్, ఫణికృష్ణ, సురేశ్, సంతోష్, ట్రాన్స్‌ప్లాంట్ హేపటాలజిస్టులు డాక్టర్ గోవింద్వర్మ, ధీరజ్ అగర్వాల్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జీఎం (కోఆర్డినేషన్) సూర్యనారాయణ, ఫేస్ ఆస్పత్రి సీఈవో ఆర్పీ సింగ్, సింగరేణి డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ బాలకోటయ్య, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి పాల్గొన్నారు.