‘మన ఊరు.. మన బడి’కి రెండు బ్యాంక్ ఖాతాలు
20 మందికి ఒక మూత్రశాల, 40 మందికి ఒక మరుగుదొడ్డి
తరగతి గదిలో నాలుగు ఫ్యాన్లు, నాలుగు ఎల్ఈడీ లైట్లు
ఆకట్టుకునే రంగులు, చిత్రాలు
ఎనిమిది మంది కూర్చునేలా డైనింగ్ టేబుల్
ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి18 : విద్యార్థులకు బడి చదువులు భారం కావొద్దు.. వారి భవిష్యత్‌కు ఆధారంగా నిలవాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. పేద విద్యార్థులకు ఆంగ్ల బోధనతోపాటు సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ప్రైవేట్ ఫీజుల నుంచి విముక్తి కల్పించి కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన అందిస్తూ విద్యార్థులను మెరికల్లా తయారు చేస్తున్నది. బడిలో ఆహ్లాదకర వాతావరణం, వనరులు, వసతులు, ఆకర్షణీయమైన భవనాలు, తరగతి గదులను నిర్మించేలా ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలలో నీటిసరఫరా, మరుగుదొడ్లు, తాగునీరు, ఫర్నీచర్, పెయింటింగ్, మరమ్మతులు, ఆకుపచ్చ రాత బోర్డులు, ప్రహరీ, వంటగది, శిథిల భవనాల స్థానంలో నూతన గదులు, భోజనశాల, డిజిటల్ బోధన తదితర ప్రాధాన్య అంశాలపై దృష్టిసారించి వాటి ఏర్పాటు కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ‘మన ఊరు- మన బడి’కి ఎంపికైన పాఠశాలలో కల్పించే సౌకర్యాలు, తరగతి గదుల నిర్మాణం, విధి, విధానాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
బడిలో ఆహ్లాదకర వాతావరణం, వనరులు, వసతులు, ఆకర్షణీయమైన భవనాలు, తరగతి గదులు విద్యార్థులను పాఠశాల వైపు నడిపిస్తాయి. చదువుపై ఆసక్తి కలిగిస్తాయి. అభ్యసనంలో పాల్గొనేలా చేస్తాయి. పాఠశాలలో అన్నివసతులు ఉండి, వాటిని సిబ్బంది, విద్యార్థులు వినియోగించుకుంటే మెరుగైన ప్రమాణాలు సాధించేందుకు దోహదం చేస్తాయి. విద్యార్థుల అవసరాలన్నింటినీ తీర్చినప్పుడు విద్యావ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. తెలంగాణలో పాఠశాల విద్యలో ప్రగతిని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు-మన బడి’, ‘మన ఊరు-మన బస్తీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ముందుకుసాగుతున్నది.
అంచనా.. అనుమతులు
పాఠశాల నిర్వహణ కమిటీ సమావేశమై అవసరాలను అంచనా వేయాలి. ఎంపిక చేసిన 12 అంశాలతోపాటు నీటిసరఫరా, మరుగుదొడ్లు, విద్యుద్ధీకరణ, తాగునీరు, ఫర్నీచర్, పెయింటింగ్, మరమ్మతులు, ఆకుపచ్చ రాత బోర్డులు, ప్రహరీ, వంటగది, శిథిల భవనాల స్థానంలో నూతన గదులు, భోజనశాల, డిజిటల్ సౌకర్యాలలో ప్రాధాన్య అంశాలు సరిచూసుకోవాలి. చేపట్టాల్సిన పనులను గుర్తించి తీర్మానం చేయాలి. ఫీల్డ్ ఇంజినీర్ పాఠశాల నిర్వహణ కమిటీతో చర్చించి ప్రధాన వసతులను గుర్తించి అంచనాలు రూపొందించాలి. పరిపాలనా అనుమతులు కలెక్టర్ ఆమోదిస్తారు. రూ.30 లక్షల వరకు డిప్యూటీ ఈఈ, రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఈఈ, రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఎస్ఈ, రూ.2 కోట్లుపైన సీఈ పరిధిలో సాంకేతిక అనుమతులు పొందాల్సి ఉంటుంది.
రెండు బ్యాంక్ ఖాతాలు..
మన ఊరు-మన బడిలో ఎంపికైన పాఠశాలలు ప్రత్యేకంగా రెండు బ్యాంక్ ఖాతాలు తెరవాలి. ఒకటి పాఠశాల పనుల నిర్వహణకు అవసరమయ్యే ఖర్చుల కోసం, రెండోది దాతలు, పూర్వ విద్యార్థుల విరాళాల నిర్వహణకు వినియోగించాలి. నిధుల విడుదలకు గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్, హెచ్ఎం, సర్పంచ్, ఫీల్డ్ ఇంజినీర్ చెక్కులపై సంతకాలు చేయాలి. పట్టణ ప్రాంతాల్లో పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్, ప్రధానోపాధ్యాయులు, ఫీల్డ్ ఇంజినీర్‌తోపాటు మున్సిపల్ చైర్మన్, మేయర్ చెక్కులపై సంతకాలు చేయాలి.
నూతన మరుగుదొడ్లు ఇలా..
ఆర్సీసీ నిర్మాణంతో 1.20*.90 మీటర్ల పరిమాణం, నీటి సరఫరా కలిగిన నాలుగు ఐడబ్ల్యూసీ (ఇండియా వాటర్ క్లోసెట్) గదులు గల మరుగుదొడ్లు నిర్మించనున్నారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు వాష్ బేసిన్లు -2, ఆర్సీసీతో నీరునిల్వ చేయడానికి ట్యాంక్ ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ఒక మరుగుదొడ్డి నిర్మించనున్నారు. 20 మంది విద్యార్థులకు ఒక మూత్రశాల, 40 మందికి ఒక మరుగుదొడ్డి నిర్మించనున్నారు.
ఫ్యాన్లు.. లైట్లు.. వాటర్
ప్రతి తరగతి గదిలో నాలుగు సీలింగ్ ఫ్యాన్లు, నాలుగు ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు అమర్చనున్నారు. పాఠశాలలో విద్యుత్ వైరింగ్, స్విచ్‌బోర్డులు, సాకెట్లు, డిస్ట్ట్రిబ్యూషన్ బోర్డులు సమకూర్చనున్నారు. వీధి దీపాలూ అమర్చనున్నారు.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నీటి ట్యాంక్, వీటిలో బ్యాటరీ ఆఫ్ టాప్స్ ఏర్పాటు చేయనున్నారు. నీటిట్యాంక్‌కు మిషన్ భగీరథ నుంచి కనెక్షన్ ఇవ్వనున్నారు.
పాఠశాలకు సరికొత్త శోభ.. విద్యార్థులకు విజ్ఞానం
పాఠశాలలకు ప్రీమియం క్వాలిటీ కలిగిన ఎనామిల్ పెయింట్ వేయనున్నారు. తరగతి గదులు, కారిడార్, ఆవరణం, ప్రహరీ, గోడమెట్లు, ఫ్లాట్‌ఫారం, ప్లే గ్రౌండ్, ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉన్న గోడలపై లెర్నింగ్ ఎయిడ్ అనే కాన్సెప్ట్ ద్వారా చిత్రాలు వేయనున్నారు. పిల్లలకు ఇష్టమైన కార్టూన్లు, జంతువులు, ప్రకృతి, సైంటిస్టులు, క్రీడాకారులు, అథ్లెట్లు, స్వాతంత్య్ర సమర యోధులు, గొప్పనాయకులు, చారిత్రాత్మక నిర్మాణాల చిత్రాలు, భూగోళం, దేశ పటాలు, చార్టులు గీయనున్నారు.
నూతన తరగతి గదులు.. డైనింగ్ హాల్..
ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో నూతన తరగతి గదులను ఆర్సీసీ నిర్మాణంలో పూర్తి చేయనున్నారు. ప్రాథమిక పాఠశాలలో తరగతిగది 10 ఫీట్ల వెడల్పు గల కారిడార్‌తోపాటు 30 మంది విద్యార్థులకు సరిపోయేలా నిర్మించనున్నారు. ఉన్నత పాఠశాలకు 6 ఫీట్ల వెడల్పు కలిగిన కారిడార్‌తో పాటు 40 మంది విద్యార్థులకు సరిపోయేలా గది నిర్మించనున్నారు. ప్రహరీని ఆర్సీసీ కాలమ్స్‌తో పునాది కలిగి ఉండేలా నిర్మించనున్నారు. 9 ఇంచుల మందం గల ఇటుక గోడ, 1.5 మీటర్ల ఎత్తు, ప్లాస్టరింగ్, పెయింటింగ్ ఉండనుంది.
భోజన శాల..
ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినడానికి వీలుగా భోజనశాల ఏర్పాటు చేయనున్నారు. 100 మంది విద్యార్థులు ఉంటే 13.28*10.25 మీటర్లు, 200 మంది విద్యార్థులుంటే 22.30*12.25 మీటర్లు, 300 మంది విద్యార్థులుంటే 31.27*12.25 మీటర్లు ఉండేలా ఆర్సీసీ నిర్మాణంతో రూపుదిద్దుకోనున్నది. ఎనిమిది మంది విద్యార్థులు కూర్చునేలా ఎస్ఎస్ 304 గ్రేడ్ డైనింగ్ టేబుల్, బెంచీలు ఏర్పాటు చేయనున్నారు.