తీర్చిదిద్దుతున్న టేకులపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు
ప్రభుత్వ కొలువులు సాధించిన అనేక మంది పూర్వ విద్యార్థులు
ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ తరగతులతో ఉత్తమ బోధన
6 నుంచి10 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య 445
విశాలమైన మైదానం, 18 తరగతి గదులు
టేకులపల్లి, ఫిబ్రవరి 20 : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులంటే అరకొర మార్కులతో ఉత్తీర్ణులవుతారనే అపోహను తొలగిస్తున్నారు ఈ సర్కారు బడి విద్యార్థులు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తీర్చిదిద్దడంతో అన్ని అంశాల్లోనూ ప్రతిభ కనబరుస్తూ రాణి స్తున్నారు. వారే.. టేకులపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు. ఇక్కడ చదివిన విద్యార్థుల్లో ఎంతోమంది వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడి మట్టిలో మాణిక్యాలుగా నిలిచారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారి సంఖ్యా గణనీయంగానే ఉంది. ఇప్పటికీ ఈ పాఠశాలలో ఇదే విధంగా విద్యాబోధన అందుతోంది. ప్రభుత్వం అన్ని వసతులూ కల్పిస్తుండడంతో మెరుగైన ఉత్తీర్ణత శాతం నమోదవుతోంది. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఇక్కడి విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంతోపాటు డిజిటల్ విద్యా బోధన అందుతోంది. విశా లమైన మైదానం, 18 తరగతి గదులు ఉన్న ఈ పాఠశాలలో 6 నుంచి 10 తరగ తుల్లో 445 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
మట్టిలో మాణిక్యాలను తయారు చేస్తున్నాయి ప్రభుత్వ పాఠశాలలు. సర్కారు బడులంటే సమస్యల లోగిళ్లనే అసోహలను తొలగిస్తూ అనేక విజయాలను సాక్షాత్కరిస్తున్నాయి. టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇదే కోవలోకి వస్తోంది. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఆరు నుంచి పది తరగతుల్లో మొత్తం 445 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇంతకు ముందు ఈ పాఠశాలల్లో చదివిన ఎంతోమంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ప్రైవేటు రంగంలో ఉన్నత స్థానాల్లో నిలిచినవారు ఎంతో మంది ఉన్నారు. ఎంతో అనుభవం కలిగిన ఈ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను మెరికలుగా తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత అన్ని తరగతులకూ ఇంగ్లిష్ మీడియం బోధన అందుతోంది. డిజిటల్ తరగతులు సైతంనిర్వహిస్తున్నారు. సువిశాలమైన ప్రాంగణంలో క్రీడలకూ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు. విద్యార్థుల కోసం 18 తరగతి గదులు అందుబాటులో ఉన్నాయి.
1985లో పూరిగుడిసెలో ప్రారంభం..
టేకులపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1985లో ఏర్పాటైంది. ఇదే గ్రామానికి చెందిన జాలాది రాధమ్మ ఇంటి వద్ద పూరిగుడిసెలో మొదలైన ఈ బడి.. కొన్నేళ్ల తరువాత తోట రామారావు ఇంటి వద్ద, ఆ తరువాత వెల్డంది సత్యనారాయణ ఇంటి వద్ద కొనసాగింది. 1998లో ప్రస్తుతం ఉన్న స్థిరమైన భవనంలోకి మారింది. ప్రస్తుతం విశాలమైన క్రీడా మైదానం, చుట్టూ ప్రహరీ, 18 తరగతి గదులు, ల్యాబ్, వంటశాల, ఆఫీస్ రూమ్, స్టోర్ రూమ్, డిజిటల్ తరగతి గదులు ఉన్నాయి. పాఠశాల చుట్టూ 350 మొక్కలు నాటగా అవన్నీ ఇప్పుడు పెద్ద చెట్లుగా ఎదిగాయి. ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.
అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు
ఈ పాఠశాలలో అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు. మ్యాథ్స్‌కు నలుగురు, సైన్స్‌కు ఐదుగురు, సోషల్‌కు ఇద్దరు, తెలుగుకు ఇద్దరు, హిందీకి ఇద్దరు ఉన్నారు. పీడీ ఒకరు. ఇంగ్లిష్‌కి మాత్రం ముగ్గురు ఉండాలి. కానీ ఒక్కరే ఉన్నారు.
మంచి ఫలితాలు వస్తున్నాయి..
పాఠశాలలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆధ్యర్యంలో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేశారు. దీంతో పిల్లలకు చదువుపై ఆసక్తి పెరిగింది. విశాలమైన తరగతిగదుల్లో అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన బోధన అందిస్తున్నాం. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయి.
–బీ.భద్రు, హెచ్ఎం
గిరిజన ప్రాంతంలో ఉత్తమ బోధన..
గిరిజన ప్రాంతంలో మంచి బోధన అందిస్తున్న ప్రభుత్వ పాఠశాల ఇది. ఎక్కువ మంది గిరిజన విద్యార్థులే ఇక్కడ చదువుతున్నారు. వారిలో అనేకమంది ప్రభుత్వ కొలువుల్లో స్థిరపడ్డారు. టీచర్లు, ఇంజినీర్లు, డాక్టర్లు, ఎంపీడీవోలు, ఎస్సైలుగా ఉద్యోగాలు సాధించారు. ఫారెస్టు, రెవెన్యూ శాఖల్లోనూ వీరే ఎక్కువగా ఉన్నారు. నేనూ ఈ పాఠశాల పూర్వ విద్యార్థిని.
–ఇస్లావత్ లక్ష్మణ్‌నాయక్, టీటీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, పూర్వ విద్యార్థి