భైరవునిపల్లి బడి అభివృద్ధికి సహాయ సహకారాలు
ఇంగ్లిష్ మీడియం అమలు చేయడంలో ముఖ్య భూమిక
ప్రభుత్వ నిధులకు తోడు ట్రస్ట్ దాతృత్వం
స్పోకెన్ ఇంగ్లిష్‌కు ప్రత్యేక ఉపాధ్యాయుడి నియామకం
అదనపు తరగతుల నిర్మాణం.. విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 13: ‘ప్రవాసంలో స్థిరపడినా సొంత ఊరు అంటే ఆయనకు ఎనలేని ప్రేమ.. గ్రామస్తులంటే అభిమానం.. పిల్లలంటే అమితమైన ఇష్టం.. పుట్టిన గడ్డకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో తన తండ్రి స్మారకార్థం ట్రస్ట్ ఏర్పాటు చేశారు.. గ్రామాభివృద్ధికి, గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి చేయూతనందిస్తున్నారు.. చదువు అందరికి అందాల్సిన వనరు.. మనం చేసే కాసింత సాయం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని నమ్మి బడిలో తరగతి గదులు నిర్మించారు.. పిల్లలు ఆడుకోవడానికి ఆటస్థలాన్ని సమకూర్చారు.. డ్రాపౌట్స్ ఉండకూడదని విద్యార్థులకు ఉచితంగా వంద సైకిళ్లు అందజేశారు.. బడిలో ఇంగ్లిష్ మీడియం అమలుకావడంలో ముఖ్య భూమిక పోషించారు.. కంప్యూటర్లు, టీవీ, యూనిఫాం, విద్యా సామగ్రి.. ఇంకా ఎంతో సాయం.. ప్రభుత్వం విడుదల చేసే నిధులకు ట్రస్ట్ సాయం తోడై పాఠశాల అన్ని వసతులు సమకూర్చుకున్నది.. ఈ పాఠశాల అభివృద్ధిపై ‘మన ఊరు- మన బడి’ విజయ గాథ.
ఉన్న ఊరిని.. కన్నతల్లిని మరచిపోకూడదు’ అనేది పెద్దల మాట.. ఈ నానుడిని నిజం చేస్తూ తాను పుట్టిన ఊరిపై ప్రేమతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఎన్ఆర్ఐ పెందుర్తి రవి. ఆయన విదేశాల్లో స్థిరపడినప్పటికీ తండ్రి పెందుర్తి మధుసూదన్‌రావు జ్ఞాపకార్థం ‘పీఎంఆర్ ట్రస్ట్’ ఏర్పాటు చేసి సోదరులు, సోదరీమణులు, సన్నిహితుల సహకారంతో భైరవునిపల్లి గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి బాటలు వేశారు. ప్రభుత్వ నిధులు, వనరులతో పాటు ట్రస్ట్ అందించిన సహకారంతో పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించింది. 2005లో ట్రస్ట్ మూడు తరగతి గదులు, కళావేదిక నిర్మించింది. 2006లో పది గుంటల ఆటస్థలం సమకూర్చింది. విద్యార్థులకు ఉత్తమ బోధన అందించేందుకు నాలుగు కంప్యూటర్లు, టీవీ, డీవీడీలు, గ్రంథాలయానికి వందలాది పుస్తకాలు, 25 డ్యూయల్ డెస్క్‌లు,యూనిఫాం, ఫర్నీచర్, విద్యాసామగ్రి సమకూర్చింది. న్యాక్, పీఎఫ్ఐ, లీడ్ ఇండియా, వందేమాతం, ఇగ్నిస్ సంస్థలతో అనుసంధానమై పాఠశాలకు వనరులను సమకూరుస్తున్నది. పాఠశాల తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్ల మాధ్యమంలోకి మారడంలో ముఖ్య భూమిక పోషించింది. దీంతో పాఠశాల పెందుర్తి మధుసూదన్‌రావు స్మారక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా అవతరించింది. సర్కార్ ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం అమలు చేసిన తర్వాత పాఠశాల మరిన్ని వసతులు సాధించనున్నది.
విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ..
భైరవునిపల్లి పాఠశాలకు సమీప గ్రామమైన అజయ్‌తండా నుంచి పదుల సంఖ్యలో వస్తారు. పాఠశాల కాస్త దూరం కావడంతో విద్యార్థుల డ్రాపౌట్స్ పెరుగుతున్నాయని గమనించిన పీఎంఆర్ ట్రస్ట్ తండా విద్యార్థులకు సైకిళ్లు ఉచితంగా పంపిణీ చేసింది. ఇప్పటివరకు సుమారు వంద సైకిళ్లు అందజేసింది. పిల్లలకు రవాణా ఇబ్బందులు లేకపోవడంతో డ్రాపౌట్స్ కూడా తగ్గాయి.
వలంటీర్ల నియామకం.. విద్యార్థులకు ప్రోత్సాహకం.
విద్యార్థులకు ఉత్తమ బోధన అందించేందుకు, ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు ట్రస్ట్ వలంటీర్లను నియమించింది. ఇద్దరు సబ్జెక్ట్ ఉపాధ్యాయులతో పాటు ఓ వ్యాయామ ఉపాధ్యాయుడికి ట్రస్ట్ నెలనెలా గౌరవ వేతనం చెల్లిస్తున్నది. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరగాలని ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లిష్ కోసం మరో ఉపాధ్యాయుడిని నియమించడం విశేషం. ఏటా పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ గ్రేడ్ సాధించిన విద్యార్థికి రూ.25 వేల నగదు ప్రోత్సాహకం అందజేస్తున్నది.
పెరిగిన విద్యార్థుల సంఖ్య..
భైరవునిపల్లి గ్రామం మండలంలో ఒక మూలకు విసిరేసినట్లు ఉంటుంది. ఇలాంటి పల్లెలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతంలో కేవలం తెలుగు మీడియం మాత్రమే ఉండేది. దీంతో బడికి వచ్చే విద్యార్థుల సంఖ్య అంతంతమాత్రంగా ఉండేది. ఐదేళ్ల క్రితం పాఠశాలలో ఆంగ్ల మీడియం ప్రారంభమైన తర్వాత క్రమ క్రమంగా పాఠశాలకు ఆదరణ పెరుగుతున్నది. పీఎంఆర్ ట్రస్ట్ సహకారంతో పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం, ఉపాధ్యాయులు ఉత్తమ బోధన అందిస్తుండడంతో గ్రామానికి చెందిన విద్యార్థులే కాక సమీప గ్రామాలకు చెందిన పిల్లలు సైతం పాఠశాలలో చేరుతున్నారు. తెలుగు మాధ్యమం ఉన్నప్పుడు 40 ఉన్న విద్యార్థుల సంఖ్య ఇప్పుడు రెట్టింపు అయింది. పాఠశాల ఆవరణ పచ్చందాలు పరచుకుని ఉంటుంది. విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకుంటున్నారు. పాఠశాల గదులు, ఆవరణంతా సూక్తులు, తైల వర్ణ చిత్రాలతో ముస్తాబై ఆకర్షణీయంగా ఉంటుంది. పాఠశాల విద్యార్థులు అకడమిక్ పరీక్షల్లోనే కాక పోటీ పరీక్షల్లోనూ రాణిస్తున్నారు.
ట్రస్ట్ తోడ్పాటుతో మౌలిక వసతులు..
నేటి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమం వైపే మొగ్గు చూపుతున్నారు. నేలకొండపల్లి మండలంలోని 36 ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలవుతున్నది. మండలంలోని 11 ప్రాథమికోన్నత పాఠశాలల్లో కేవలం రెండు పాఠశాలల్లో మాత్రమే తెలుగు మీడియం తరగతులు జరుగుతున్నాయి. పీఎంఆర్ ట్రస్ట్ సౌజన్యంతో భైరవునిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధి చెందుతున్నది. ఇప్పటికే ట్రస్ట్ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించింది. వలంటీర్లను నియమించింది. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తున్నది.
– బానాల వెంకటరామాచారి, మండల విద్యాశాఖ అధికారి, నేలకొండపల్లి