రఘునాథపాలెం, మార్చి15: స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) ఆధ్వర్యంలో మంచుకొండ రెవెన్యూ పరిధిలోని 200 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. ఖమ్మం నగరంతో పాటు రఘునాథపాలెం మండలాభివృద్ధికి నిధులు వెచ్చిస్తున్న సుడా.. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ద్వారా మరింత ఆదాయాన్ని సేకరించే ఆలోచన చేస్తున్నది. వచ్చిన ఆదాయంతో మండలాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది. గ్రామంలో ఎక్కువగా అసైన్డ్ భూములు ఉన్నట్లుగా గుర్తించిన సుడా ఇల్లెందు ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న భూములపై దృష్టి సారించినట్లు సమాచారం. ఇప్పటికే తహసీల్దార్ నర్సింహారావు అసైన్డ్ రైతులతో ఒకసారి సమావేశమయ్యారు.
ప్రభుత్వమే ల్యాండ్ పూలింగ్ ద్వారా అసైన్డ్ భూములను లే-అవుట్ చేసి విక్రయించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రైతులు భూములు ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. భూములను అప్పగించిన తర్వాత వచ్చే ఆదాయంలో ప్రభుత్వత తమకు 60శాతం వాటా ఇస్తుందనే ఆశతో రైతులు ఉన్నారు. గ్రామంలోని సర్వే నెంబర్ 338లో 200 పైచిలుకు అసైన్డ్ భూములను రెవెన్యూ అధికారులు గుర్తించారు. కలెక్టర్‌కు నివేదిక అందించారు. సదరు భూములపై 100 మందికి పైగా రైతులు హక్కులు కలిగి ఉన్నారు. వీరిలో కొందరు పట్టాదారు పాసుబుక్స్ కలిగి ఉండగా మరికొందరి భూములకు డిజిటల్ సంతకం పూర్తయినట్లు తెలిసింది.
ల్యాండ్ పూలింగ్‌కు ప్రతిపాదించిన భూములను మంగళవారం కలెక్టర్ వీపీ గౌతమ్ పరిశీలించారు. కలెక్టర్ పర్యటన గురించి తెలుసుకున్న రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. కలెక్టర్ వారితో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కలెక్టర్ పర్యటనలో భాగంగా తహసీల్దార్ నర్సింహారావును పలు విషయాలపై ఆరా తీశారు. సదరు భూములను పరిశీలించారు. పర్యటనలో ఎంపీడీవో రామకృష్ణ, సర్వేయర్ ఆఫ్ ఏడీ నాగభూషణం తదితరులున్నారు.