
ఖమ్మం ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి ): ఒక రైతు మృతిచెందితే అతని కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి రైతుకు రైతుబీమా పథకాన్ని వర్తింపజేస్తున్నది. రైతు మృతిచెందిన అతికొన్ని రోజుల్లోనే నామినీ ఖాతాల్లో రూ.5 లక్షల పరిహారాన్ని జమ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నది. 2018 ఆగస్టులో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో 2,346 మంది రైతులు మృతిచెందారు. వారి కుటుంబాలకు బీమా సంస్థ రూ.5 లక్షల చొప్పున మొత్తం 117.30 కోట్లు జమ చేసింది. ఆయా కుటుంబాలకు సర్కార్ ఆర్థిక భరోసానిచ్చింది. మృతుల పిల్లల చదువులు ఆగిపోకుండా, వారి ఇంట్లో ఆర్థిక స్థితిగతులు మారకుండా, అప్పుల పాలు కాకుండా ఆదుకుంటున్నది. రైతు చనిపోయిన సమాచారం అందుకున్న వ్యవసాయ విస్తరణ అధికారులు స్వయంగా రైతు కుటుంబాన్ని పరామర్శించి రైతుబీమా అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అతి తక్కువ రోజుల్లో బాధిత కుటుంబానికి బీమా అందేలా చూస్తున్నారు.
ప్రభుత్వమే బీమా చెల్లింపు..
రైతుబీమా పథకం అమలు కోసం ప్రభుత్వం లైఫ్ ఇన్సురెన్స్ కార్పొ రేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)తో ఒప్పందం చేసుకున్నది. భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుని పట్టాదారు పాస్‌పుస్తకం తీసుకున్న రైతులను ప్రభుత్వం ఈ పథకానికి అర్హులుగా గుర్తించింది. గుంట భూమి ఉన్నా ఆ రైతుకు రైతుబీమా వర్తింపజేస్తున్నది. ఏటా ఒక్కో రైతు తరఫున ప్రభుత్వమే రూ.3 వేలకు పైగా ప్రీమియం చెల్లిస్తున్నది. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 1.85 లక్షల మంది అర్హులు ఉన్నారు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు ఈనెల 30లోపు రైతుబీమాకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నది. దరఖాస్తు చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నది. వ్యవసాయశాఖ అధికారులు ఈ మేరకు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.