ఖమ్మం మార్చి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను బేషరతుగా తగ్గించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్ ధరల పెంపునకు నిరసనగా శుక్రవారం ఖమ్మం నగరంలోని ధర్నాచౌక్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన వంటావార్పు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే నరేంద్ర మోదీ ప్రధాని కావడం దురదృష్టకరమన్నారు. సిలిండర్ ధరలు పెంచి నిరుపేదలపై భారం మోపడం దారుణమన్నారు. ఏడాదిలో మూడుసార్లు సిలిండర్ ధరలు పెరిగితే బీజేపీ నాయకులు ఒక్కరు కూడా నోరుమెదపకపోవడం విచారకరమన్నారు. సామాన్య ప్రజల బాధలు బీజేపీ నేతలకు ఏమాత్రం పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీకి గ్యాస్ వ్యవస్థను అప్పగించే పనిలో ప్రధాని మోదీ ఉన్నారన్నారు. వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా రూ.352 పెంచడం అన్యాయమన్నారు. చిరు వ్యాపారులు, బజ్జీల బండీ నడుపుకొనే వారికి పెరిగిన ధరలు మోయలేని భారమన్నారు.
ఆయా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు వచ్చాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడన్నారు. కేంద్రం ఒకేసారి సిలిండర్ ధర రూ.50కు పెంచితే ఆయన నోరుమోదకపోవడం శోచనీయమన్నారు. ఏడాదిలోపు విదేశాల్లోని నల్లడబ్బును వెనక్కు తీసుకువస్తానని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ఎనిమిదేళ్లయినా ఆ పని చేయలేదన్నారు. ప్రతి పేదవాని బ్యాంక్ ఖాతాలో లక్షలు జమ చేస్తానని మోసగించాడన్నారు. ఉల్లిగడ్డల ధర పెరిగితే తాను ‘ఉల్లిగడ్డ తినను’ అనే నిర్మలా సీతారామన్ మన కేంద్ర మంత్రి కావడం సిగ్గు చేటు అన్నారు. పిల్లలకు అందించే పాలు, పెరుగు.. ఆఖరికి చేనేత వస్ర్తాలపైనా జీఎస్టీ విధించడం ఎంతవరకు సమంజసమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాని సిలిండర్ ధరపై రూ.50 పెంచితే నేటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అప్పట్లో గగ్గోలు పెట్టారన్నారు.
మరి ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్లారన్నారు. కట్టెల పొయ్యిపై వంట వండుకునే నిరుపేదలకు సిలిండర్లు అంటగట్టి ఇప్పుడు ధరలు పెంచడం సరికాదన్నారు. తన ఆప్తమిత్రుడు అదానీకి మేలు చేసేందుకే ప్రధాని మోదీ ధరల పెంచుతున్నారన్నారు. 75 ఏళ్ల స్వంతంత్ర భారత చరిత్రలో ఇంతగా సిలిండర్ ధరలు పెంచిన ప్రభుత్వం ఒక్క బీజేపీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. ఎనిమిదేళ్ల క్రితం రూ.450 ఉన్న సిలిండర్ ధర రూ.1100 దాటిందన్నారు. పేదవాడి రక్తాన్ని పీల్చి కేంద్రం గుజరాత్‌కు చెందిన కార్పొరేట్ శక్తులకు మేలు చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదలకు అండగా నిలుస్తుంటే.. కేంద్రం మాత్రం పేదవాళ్లను పీల్చి పిప్పి చేస్తున్నదని ధ్వజమెత్తారు. రాజ్యాంగ బద్ధంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసే ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. మన రాష్ట్రంలోనూ అదే జరుగబోతుంటే సీఎం కేసీఆర్ ముందే పసిగట్టి బీజేపీ బాగోతాన్ని ప్రజల ముందు పెట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వ దోపిడీకి అడ్డుకట్ట పడాలంటే కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. దేశాన్ని అమ్మే సంస్కృతి పోయి కాపాడుకునే సంస్కృతి రావాలన్నారు. పేదలకు బీమా కల్పించే ఎల్ఐసీని సైతం కేంద్రం కార్పొరేట్ శక్తులకు అప్పగించే పనిలో ఉందన్నారు. కేఎంసీ మేయర్ నీరజ, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.