రానున్న సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి ఒక్క నియోజకవర్గంలోనూ డిపాజిట్ రాదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సవాల్ చేశారు. శుక్రవారం సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన రాజ్యసభ సభ్యుల అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, టీఆర్ఎస్ శ్రేణులు బతుకమ్మలు, బోనాలు, కోలాటాలు, గజమాలతో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రకు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో మంత్రి పువ్వాడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్, చైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులతో కలిసి రాజ్యసభ సభ్యులను ఘనంగా సన్మానించారు. తల్లాడ నుంచి సత్తుపల్లి వరకు నిర్వహించిన రోడ్ షో జన సంద్రంగా మారింది. మంత్రి మాట్లాడుతూ బీజేపీ బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్‌కు లొంగే ప్రసక్తే లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. సీతారామ ప్రాజెక్ట్‌తో ఉమ్మడి జిల్లా సస్యశామలం అవుతుందన్నారు.
ఖమ్మం, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రానున్న సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీకి ఒక్క నియోజకవర్గంలోనూ డిపాజిట్ వచ్చే అవకాశమే లేదని, జిల్లాలో బీజేపీని నిలువరించే శక్తి లౌకికవాదులకు ఉందని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం సత్తుపల్లిలోని జేవీఆర్ కళాశాలలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన జరిగిన రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర అభినందన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి పథంలో అగ్రగామిగా ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా నాయకులు, ప్రజలను అత్యంత ఆత్మీయంగా చూసుకుంటున్నారని, ఏ అవకాశం లభించినా రాజకీయంగా ఖమ్మానికి కల్పిస్తున్నారని అన్నారు.
ఇందుకు అనుగుణంగానే ఎంపీలుగా ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం కల్పించారని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని టీఆర్ఎస్ నేతలమంతా ఐక్యంగా నిలిచి మరోసారి టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా రాజీలేని పోరు చేస్తామన్నారు. జిల్లాలో 10 నియోజకవర్గాలను గెలిచి తీరేందుకు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శవంతంగా మారాయని, అనేక రాష్ర్టాలు తమకు ఈ తరహా పథకాలు కావాలని అడిగే పరిస్థితి ఉందన్నారు.
జిల్లాలోని కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు రూ.900 కోట్లు వెచ్చించి సింగరేణి సంస్థ రైల్వేలైన్ నిర్మిస్తే ఆ ప్రారంభోత్సవానికి జిల్లా మంత్రిగా తనను, ఎంపీలను పిలవాలన్న కనీస మర్యాద లేకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని, బీజేపీ బాధ్యతారాహిత్య వ్యవహారానికి ఇది మచ్చుతునక అన్నారు. రాజకీయ నేతలను బెదిరించి పార్టీలో చేర్చుకోవడం బీజేపీకి ఆనవాయితీగా మారిందన్నారు. బీజేపీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు టీఆర్ఎస్ నేతలు తలొగ్గబోరన్నారు. బీజేపీ రాజకీయాలను గబ్బు పట్టిస్తోందని, జుగుప్సాకరంగా, అత్యంత హేయంగా వ్యవహరిస్తున్నదన్నారు. స్వాముల ద్వారా శాసనసభ్యులను కొనుగోలు చేయడానికి సైతం వెనుకాడని నీచపద్ధతులకు బీజేపీ వడిగట్టిందన్నారు.
ఖమ్మం, నల్లగొండ లౌకికవాదుల అడ్డా అని ఈ జిల్లాల్లో బీజేపీకి స్థానం ఉండబోదన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఎన్నికలు జరుగుతున్న గుజరాత్లో కాకుండా జోడో యాత్ర పేరుతో ఇతర రాష్ర్టాల్లో తిరగడమేమిటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారడం వల్లే దేశంలో బీజేపీ ఆటలు సాగుతున్నాయని, బీజేపీని నిలువరించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. రాహుల్‌గాంధీ ప్రజల్లో చేసే జిమ్మిక్కుల వల్ల ప్రయోజనంలేదని, ఆ యాత్ర ఏదో మునుగోడులో చేస్తే కనీసం 10వేల ఓట్లు కాంగ్రెస్‌కు వచ్చేవని ఆయన ఎద్దేవా చేశారు.
జిల్లా నుంచి ఎంపీలు అయిన బండి పార్థసారథిరెడ్డి సేవాభావం కలిగిన వ్యక్తి అని, కరోనా సమయంలో రాష్ర్టానికి రెమిడీఫీవర్ ఇంజక్షన్లు 2 లక్షలు, జిల్లాకు 2వేలు అడగ్గానే ఇచ్చి జిల్లాపై ప్రేమను చాటుకున్నారన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తనకు బాల్యమిత్రుడని, ఇప్పుడున్న రెండు సంవత్సరాల పదవీకాలంతోపాటు మరో ఆరేళ్లు ఆయనే రాజ్యసభ సభ్యుడిగా ఉంటారని, ఆయన పదవీకాలం ముఖ్యమంత్రి పొడిగిస్తారని అన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో పార్థసారథిరెడ్డి, రవిచంద్రకు సత్తుపల్లి నియోజకవర్గం తరఫున భారీగా పౌర సన్మానం నిర్వహించారు. శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా తల్లాడ నుంచి సత్తుపల్లి వరకు దాదాపు 50 కిలోమీటర్లు వందలాది కార్లు, మోటారుసైకిళ్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ అభినందన సభలో మాజీ మంత్రి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, శాసనసభ్యులు హరిప్రియానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, కందాళ ఉపేందర్‌రెడ్డి, రాములునాయక్, జిల్లా పరిషత్ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కోరం కనకయ్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్పై అవాకులు, చెవాకులు పేలుతున్నదని, సరైన సమయంలో బుద్ధి చెబుతామని ఖమ్మం లోక్‌సభ సభ్యుడు నామా నాగేశ్వరరావు అన్నారు. రాష్ర్టాభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకోవడానికి కుట్ర చేస్తుందన్నారు. వచ్చే సంవత్సరం ఎన్నికల సంవత్సరమని, ఇప్పటివరకు ప్రజల ఊసెత్తని పార్టీలు వివిధ వేషాలతో ప్రజల వద్దకు వచ్చి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఖమ్మం జిల్లా సంక్షేమం, అభివృద్ధిలో దూసుకుపోతున్నదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సేవాతత్పరత కలిగిన ఇద్దరు ముఖ్యులకు జిల్లా నుంచి రాజ్యసభ దక్కడం ప్రజల అదృష్టమన్నారు. పెనుబల్లి మండలం నీలాద్రీశ్వరుని ఆలయానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రూ.కోటి సాయం చేయడానికి అంగీకరించారని, అలాగే నియోజకవర్గానికి చెందిన ఎంపీ పార్థసారధిరెడ్డి సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలో గ్రంథాలయ నిర్మాణానికి, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం పునఃనిర్మాణానికి తోడ్పాటు అందించాలని కోరారు.
టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఈ ప్రాంత వాసిగా నిరంతరం శ్రమిస్తానని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి అన్నారు. తాను చదువుకున్న జూనియర్ కళాశాలకు భవనాన్ని నిర్మిస్తానని, విజ్ఞానాన్ని పెంపొందించే గ్రంథాలయాన్ని సత్తుపల్లిలో ఆధునిక వసతులతో నిర్మిస్తానని, వేంసూరులో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తానన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం పర్యటించి తన సొంత నిధులతో ఈ ప్రాంతాభివృద్ధికి తోడ్పడతానన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అపరమేధావి అని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సీఎం కేసీఆర్‌ను గెలిపించుకోవడమంటే మనల్ని మనం గెలిపించుకోవడం, గౌరవించుకోవడమన్నారు. రూ.60 వేల కోట్లుగా ఉన్న తెలంగాణ రాబడి కేసీఆర్ పాలనలో లక్షా 80 వేల కోట్లకు చేరిందని, 6లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. గోదావరి జలాలను సీతారామ ద్వారా కృష్ణానదిలో కలిపేందుకు కేసీఆర్ చేస్తున్న భగరీథ ప్రయత్నం జిల్లాకు వరం లాంటిదన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఉన్న నలుగురు ఎంపీలం కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
ధాన్యం కొనుగోలు చేయడం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తున్నదని శాసనమండలి సభ్యుడు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. వ్యవసాయ పంటల విధానంలోనూ, తోటల పెంపకంలోనూ సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలు రాష్ర్టానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఎవరెన్ని ఎన్ని మాయమాటలు చెప్పినా రైతులు నమ్మాల్సిన అవసరంలేదని, రైతుబంధు త్వరలో మరోసారి రైతుల ఖాతాల్లో జమకానుందన్నారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో 33 జిల్లాల మువ్వల బండి ప్రచారహోరుతో సిద్ధమైందని, ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయం సాధించడమే లక్ష్యంగా ఈ బండి ప్రయాణిస్తుందని ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యుడు రేగా కాంతారావు అన్నారు. ఎంపీ పార్థసారధిరెడ్డి మనసున్న మంచి మనిషని, తమ నియోజకవర్గ ప్రజలు వరదలతో అల్లాడుతుంటే నేనున్నానంటూ ఆర్థికసాయం అందించారని ప్రశంసించారు.
జిల్లా అభివృద్ధి, పార్టీ బలోపేతానికి ఎంపీలు బండి పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర కృషి చేయాలని పార్లమెంట్ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు.