
పాఠశాలలు, కళాశాలలు తెరువాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెసిడెన్షియల్, సాంఘిక సంక్షేమ పాఠశాలలు మినహా మిగతా పాఠశాలలు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆఫ్లైన్, ఆన్లైన్ తరగతుల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ఈ అంశంపై యాజమాన్యాలే తుది నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. పాఠశాలకు హాజరుకావాలని విద్యార్థులపై ఒత్తిడి తేవద్దని మార్గదర్శకాల్లో పేర్కొన్నది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థలు ఆఫ్లైన్తోపాటు ఆన్లైన్ బోధనకు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించనుండడంతో శానిటైజేషన్ కార్యక్రమాలు పూర్తి చేశారు. బుధవారం బడుల ప్రారంభానికి సర్వం సిద్ధం చేశారు.
కరోనా సంక్షభంతో విద్యారంగం కుదేలైంది. వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలు తెరిచేందుకు ముందుకొచ్చింది. దీంతో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని విద్యాసంస్థల్లో నేటి నుంచి ఆఫ్లైన్ బోధన ప్రారంభం కానున్నది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో మాత్రం ఆఫ్లైన్, ఆన్లైన్ అనేది యాజమాన్యాలే నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఆఫ్లైన్, ఆన్లైన్ తరగతులు రెండూ నిర్వహించడానికి స్కూల్ మేనేజ్మెంట్లు నిర్ణయం తీసుకోవచ్చు. ప్రత్యక్ష తరగతులకు విద్యార్థులను పంపడం ఇష్టం లేకపోతే తరగతులకు రావాలని ఒత్తిడి తేవద్దని నిబంధనల్లో పేర్కొంది.
ప్రైవేట్లో ఆన్లైన్ కూడా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాఠశాల విద్యలోని అత్యధిక ప్రైవేట్ స్కూల్స్ ఆఫ్లైన్తోపాటు ఆన్లైన్ విద్యను అందించనున్నాయి. ఇప్పటికే చాలా స్కూల్స్ ఆఫ్లైన్తోపాటు ఆన్లైన్ తరగతులు కొనసాగుతాయని విద్యార్థులకు సందేశాలు పంపించారు. అభ్యంతరం లేని విద్యార్థులు పాఠశాలలకు రావొచ్చని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పాఠశాలలను సిద్ధం చేశామని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.
రెసిడెన్షియల్ మినహా…
ప్రభుత్వ రెసిడెన్షియల్, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, వసతి సౌకర్యాలున్న ఇతర స్కూల్స్ నిర్వహణకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. వీటిపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నది. కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి శానిటైజేషన్ కార్యక్రమాలను పూర్తి చేశాయి. కొవిడ్ నిబంధనల మేరకు సిద్ధం చేశారు. విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం వైద్య, విద్యాశాఖకు సూచనలు చేసింది. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విద్యార్థులకు సమస్యలు రాకుండా ఉండేలా చర్యలు చేపట్టింది.
పాఠశాలలు, కళాశాలల్లో పారిశుధ్య పనులు పూర్తి
పాఠశాలలు, కళాశాలలన్నీ బుధవారం నుంచి తెరుచుకోనున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రతి పాఠశాలను పరిశీలించి ప్రారంభానికి సిద్ధం చేశారు. పాఠశాల ఆవరణంలో మామిడి తోరణాలు కట్టి పండుగ వాతావరణంలో విద్యార్థులను ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేశారు. పాఠశాలలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించేందుకు పైప్ కనెక్షన్లు వేయించారు. పాఠశాలల్లోని కిచెన్ షెడ్లను శుభ్రపర్చి విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. మాస్కులు ధరించి పాఠశాలలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. భద్రాద్రి జిల్లాలో మొత్తం 1,733 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 15, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 13, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు 776, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు 164, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 96, కేంద్ర ప్రభుత్వ పాఠశాల 1, ఆశ్రమ పాఠశాలలు 84, కేజీబీవీలు 14, మినీ గురుకులాలు 1, మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలలు 6, మహాత్మా జ్యోతి బాపూలే బీసీ వెల్ఫేర్ వసతి గృహాలు 10, ఎన్సీఎల్పీ 26, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు 9, జూనియర్ కాలేజీలు 7, టీఎస్ఆర్ఈఐఎస్ 1, యూఆర్ఎస్ 1, ప్రైవేటు పాఠశాలలు 200 ఉన్నాయి. వీటిలో 1,57,067 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలు కూడా ప్రారంభం కానున్నాయి.
అన్ని ఏర్పాట్లు చేశాం..
పాఠశాలల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్కూల్స్ నిర్వహించనున్నాం. విద్యార్థుల ఆరోగ్యంలో తేడాలు గమనిస్తే వెంటనే ఆరోగ్య కేంద్రాలు, తల్లిదండ్రులకు, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించాం.
-డీఈఓ యాదయ్య
విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు
పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. వారం రోజులుగా అన్ని పాఠశాలల్లో పారిశుధ్య పనులు చేపట్టాం. తరగతి గదులను శుభ్రం చేయించాం. పంచాయతీ సిబ్బంది పాఠశాల ఆవరణలోని చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. శానిటైజ్ చేయించారు. బ్లీచింగ్ చల్లించాం. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ తరగతులు నిర్వహించనున్నాం.
వ్యాక్సిన్ వేయించుకుంటేనే విధులకు..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. వ్యాక్సిన్ వేయించుకున్న సిబ్బంది, అధ్యాపకులు మాత్రమే విధులకు హాజరుకావాలి. గెస్టు ఫ్యాకల్టీ మినహా అంతా విధులకు హాజరవుతున్నారు. విద్యార్థులు మాత్రం నేటి నుంచి తరగతులకు హాజరుకానున్నారు. కాలేజీల ప్రారంభానికి, తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.