దివ్యాంగుల ఆరాధ్యదైవం ముఖ్యమంత్రి కేసీఆర్
రూ.3 వేల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
కొద్ది రోజుల్లో హైదరాబాద్‌లో దివ్యాంగుల భవనం
రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి
ఖమ్మంలో దివ్యాంగులకు స్కూటర్లు, వీల్చైర్ల పంపిణీ
ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 12: దివ్యాంగులకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్న సీఎం కేసీఆర్.. వారికి ఆరాధ్యదైవంగా నిలిచారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే.వాసుదేవరెడ్డితో కలిసి నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో రూ.43.97 లక్షల విలువైన స్కూటర్లు, బ్యాటరీ ట్రై సైకిళ్లు, ఇతర సహాయ ఉపకరణాలను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట వ్యాప్తంగా రూ.24 కోట్లతో 17 వేల మందికి తొలివిడతగా వందశాతం రాయితీపై మూడు చక్రాల స్కూటర్లు, బ్యాటరీ వీల్చైర్లు అందజేస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారుడిపై ఆర్థిక భారం పడవద్దనే ఉద్దేశంతో ఒక్కో వాహనానికి రూ.లక్ష వెచ్చించి అందిస్తున్నామన్నారు. ప్రతి దివ్యాంగుడినీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. గతంలో రూ.500 ఉన్న దివ్యాంగుల పింఛన్‌ను రూ.3016కు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని, ఇలాంటి పింఛన్ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ దివ్యాంగులకు అందడంలేదని గుర్తుచేశారు. విద్య, ఉద్యోగాల నుంచి డబుల్ బెడ్ ఇళ్ల వరకూ అని పథకాల్లోనూ దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు.
త్వరలో అందుబాటులోకి దివ్యాంగుల భవనం: వాసుదేవరెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగులకు సముచిత స్థానం కల్పించిందని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి గుర్తుచేశారు. రెండెకరాల విస్తీర్ణంలో రూ.5 కోట్లతో హైదరాబాద్‌లో నిర్మిస్తున్న దివ్యాంగుల భవనం త్వరలోనే అందుబాటులోకి రానుందన్నారు. మరికొద్ది రోజుల్లో ఉద్యోగాల నోటిఫికేషన్లు రానున్నాయన్నారు. ప్రతి జిల్లాలో అర్హత కలిగిన దివ్యాంగులకు ఉచితంగా స్కూటర్లు, బ్యాటరీ వీల్చైర్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరింత మంది దివ్యాంగులకు అందజేస్తామన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలోనూ దివ్యాంగులకు ఇంత పెద్ద మొత్తంలో పింఛన్ అందడం లేదని గుర్తుచేశారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులను మంత్రి పువ్వాడతో కలిసి సన్మానించారు. కలెక్టర్ గౌతమ్, మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, కార్పొరేటర్ పాలెపు విజయ, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, డీడబ్ల్యూవో సంధ్యారాణి, డీఆర్డీవో విద్యాచందన, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, వికలాంగుల సంఘం నాయకులు డోన్వాన్ నాగరాజు, జీవరత్నం, సురేశ్, సీడీపీవో పాల్గొన్నారు.