ఖమ్మం, జూన్ 15: వర్షాకాలం దృష్ట్యా నగరంలోని పారిశుధ్య సమస్యలు రాకుండా పకడ్బందీగా ముందస్తు చర్యలు తీసుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఖానాపురం హవేలీ, ఊర చెరువు, లకారం ట్యాంక్‌బండ్, చెరువు బజార్, సుందరయ్య నగర్, ప్రకాశ్నగర్లలో కేఎంసీ మేయర్ నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభిలతో కలిసి బుధవారం పర్యటించారు.ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లోని నాళాలను పరిశీలించారు. 41వ డివిజన్లోని లకారం ట్యాంక్‌బండ్ పక్కనే మేజర్ కచ్చా కాలువ పూడికతీత పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కర్నాటి కౄష్ణ సీక్వెల్ రోడ్డు, తుమ్మలగడ్డ, చెరువుబజార్లలోని లోతట్టు ప్రాంతాలను కలెక్టర్‌కు చూపించి ముంపు తీవ్రత లేకుండా చర్యలు తీజుకోవాలని కోరారు. లకారం పక్కనే ఉన్న మేజర్ వాగులోని సిల్ట్ తొలగింపును రెండు రోజుల్లో పూర్తి చేయాలని మున్సిపల్ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని నాళాలు, సైడ్ డ్రైయిన్లను క్లీన్ చేయాలని, నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని, నాళాలను ఆక్రమించి చేపట్టిన కట్టడాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటి, క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ స్థలాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, మొక్కలు నాటాలని సూచించారు. ఊర చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ట్యాంక్‌బండ్ వద్ద ప్రజలతో మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ప్రజలు కూడా తమ ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులు ధరి చేరవన్నారు. విద్యుత్ ఎస్ఈ సురేందర్, డిప్యూటీ మేయర్ ఫాతిమా, ముక్తార్, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్‌కుమార్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, నాగండ్ల కోటేశ్వరరావు, దండా జ్యోతిరెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు ఎర్రా అప్పారావు పాల్గొన్నారు.