భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ)/ఖమ్మం కల్చరల్, అక్టోబర్ 4:ఆశ్వయుజ శుద్ధ దశమి బుధవారం దసరా పండుగను జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. జిల్లా కేంద్రంలో శమీ పూజలు, దసరా సంబురాలు నిర్వహించుకునేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్తగూడెంలోని మొర్రేడు వాగు, రైటర్బస్తీ, రామవరం, రుద్రంపూర్, పెద్దమ్మతల్లి ఆలయం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో దసరా ఉత్సవాల వేదికలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన దసరాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆశ్వయుజ శుద్ధ దశమి బుధవారం దసరా పండగను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకోనున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రాచీన దివ్యక్షేత్రం స్తంభాద్రి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం, పారువేట స్థలమైన జమ్మిబండ దసరా ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శమీ పూజలు, దసరా సంబురాలను జరుపుకునేందుకు జిల్లా ప్రజలు సమాయత్తమయ్యారు. శ్రీలక్ష్మీనృసింహస్వామి పారువేట స్థలమైన జమ్మిబండ రంగులు, విద్యుత్దీప కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. అర్చకులు శాస్ర్తోక్తంగా జమ్మి చెట్టుకు పూజలు చేసిన అనంతరం శమీ శ్లోకంతో భక్తులు తమ గోత్ర నామాలను రాసి, కోరికలను తీర్చాలని కోరుతూ ఆ చెట్టుకు కాగితాలను వేలాడదీస్తారు.
శ్రీస్తంభాద్రి ఆలయం..
శ్రీలక్ష్మీసమేతుడై స్వయంభుగా శ్రీలక్ష్మీనృసింహస్వామి వెలిసిన స్థల పురాణం గల అతి ప్రాచీన మహిమాన్విత దివ్య పుణ్యక్షేత్రమే ఖమ్మంలోని స్తంభాద్రి కొండ. గుట్టపై వెలిసిన స్వామిని దర్శించుకోవడానికి వీలు కాని వారు స్వామిని దర్శించుకోవడానికి ప్రత్యామ్నాయ వేదికగా జమ్మిబండను ఎంచుకున్నారు. కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా స్వామిని దర్శించుకునే వీలు కల్పించడానికి జమ్మిబండ వద్ద స్వామి పారువేట స్థలంగా పేర్కొని కల్యాణ మండపాన్ని నిర్మించారు. ప్రతి విజయదశమి పర్వదినాన స్వామి ఈ పారువేటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. ఆ సంవత్సరంలోని చెడునంతా పారదోలడానికి గుట్టపై నుంచి ఊరేగింపుగా జమ్మిబండ వద్దకు రావడమే పారువేటగా ప్రసిద్ధి చెందింది. ఆనాటి నుంచి ఏటా విజయదశమి నాడు ఇక్కడికి స్వామి రావడం, భక్తులు దర్శించుకొని శమీపూజ చేయడం ఆనవాయితీ.
జమ్మిబండ వద్దకు పారువేటగా..
విజయదశమి సందర్భంగా స్వామివారు లక్ష్మీ సమేతుడై గ్రామాంతరం వెళ్లే ఉత్సవమే జమ్మిబండ పారువేట స్థలం. ఆనాడు దట్టమైన అరణ్య ప్రాంతంగా ఉన్న జమ్మిబండ ప్రాంతంలో శమీవృక్షం వద్దకు స్వామి వారిని ఊరేగింపుగా తీసుకొచ్చేవారు. ఆనాడు రెడ్డి రాజుల నుంచి నిజాం నవాబుల వరకు పారువేట ఉత్సవాన్ని అధికార లాంఛనాలతో జరిపించేవారు. అందుకే నేటికీ అధికారికంగానే ఈ పారువేట ఉత్సవం నిర్వహిస్తున్నారు.
శమీ పూజ ప్రాధాన్యం..
ఈ శమీవృక్షం ప్రస్తావన రామాయణ, మహాభారతాల్లో ప్రస్ఫుటిస్తున్నది. రావణున్ని సంహరించే ముందు శ్రీరామచంద్రుడు, కౌరవులపై విజయాన్ని సాధించేముందు పాండవులు ఈ శమీవృక్షానికి పూజలు చేశారు. విజయాలను అందించే ఈ వృక్షాన్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయనేది నమ్మకం. ఈ వృక్షాన్ని అపరాజితా దేవి రూపంగా కొలుస్తారు. తమకు విజయాలు వరించాలని విజయదశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్లి పూజలు చేస్తారు. ఆ ఆకులు తీసుకొచ్చి పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు. జమ్మి వృక్షాన్ని పూజిస్తే మన పాపాన్ని శమింపజేస్తుందని, శత్రువులను నాశనం చేస్తుందని, పనులన్నింటినీ విజయవంతంగా సాగింపజేస్తుందని విశ్వాసం.
భక్తి ప్రపత్తులతో మహర్నవమి..
శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జగన్మాత ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆశ్వయుజ శుద్ధ నవమి బుధవారం మహర్నవమి పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయాలు, పలు ఉత్సవ మండపాల్లో కొలువైన అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. నగరంలోని శ్రీకన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవిమాత శ్రీ మహాకాళి దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. అనంతరం బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.
రావణ సంహారమే దసరా..
విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుడిపై గెలిచిన సందర్భమేగాక పాండవులు వనవాసం వెళ్తూ.. చెట్టుపై వారి ఆయుధాలను తిరిగి తీసుకెళ్లిన రోజు. ఈ సందర్భంగానే రావణ వధ కార్యక్రమం నిర్వహించడడం, జమ్మి ఆకులకు పూజ చేయడం ఆనవాయితీ. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతణ్ని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా ప్రజలంతా సంతోషంగా విజయదశమి పండుగ జరుపుకున్నారు. అదే విజయదశమి.