పెద్దలను ఒప్పించి.. ప్రేమను గెలిపించుకుని..
పెళ్లి పీటలెక్కి.. దాంపత్య జీవితాన్ని పండించుకున్న జంటలకు హ్యాట్సాఫ్
నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం
ఖమ్మం కల్చరల్, ఫిబ్రవరి 13;‘ప్రేమ’ రెండక్షరాలు.. ‘పెళిల రెండక్షరాలు.. కానీ ‘ప్రేమ’తో ప్రయాణం మొదలు పెట్టి ‘పెళ్లి’ అనే ‘గమ్యం’ చేరుకోవడం అంత సులభం కాదు.. అలా అని కష్టతరమూ కాదు.. పరిపక్వతతో ఆలోచించి, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటే అదే జీవన పరమార్థం. అనంత జీవన ప్రయాణంలో ఒకరికి ఒకరు తోడు సంపాదించుకోవడమే జీవిత మాధుర్యం. అలా ప్రేమను దక్కించుకున్న వారిపై స్పెషల్ స్టోరీ.
‘ప్రేమ’ రెండక్షరాల అద్భుతం.. అందమైన అనుభూతి.. రెండు మనసుల కలయిక. ప్రేమ గురించి చెప్పడానికి మాటలు చాలవు.. అనంత జీవన ప్రయాణంలో తోడు ప్రేమ ప్రేమ జీవితంలో ఆనంద పరిమళాలను పరిచయం చేస్తుంది.. లోలోపల అణచుకున్న హృదయ భావాలను మేల్కొలుపుతుంది.. ప్రేమికులు పరిపక్వతతో ఆలోచించి, పెద్దలను ఒప్పించి, వివాహం చేసుకుని, జీవితాన్ని అనురాగ సంగమంగా మార్చుకుంటే అదే పరిపూర్ణత. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పై మాటలను నిజం చేసిన ప్రేమికులపై ‘నమస్తే’ ప్రత్యేకం..
ప్రేమికుల దినోత్సవం చరిత్ర ఇదీ..
క్రీస్తు శకం 270 ప్రాంతంలో రోమ్ నగరంలో ‘వాలంటైన్స్’ అనే క్రైస్తవ ప్రవక్త ఉండేవాడు. ప్రేమ వల్లనే ప్రపంచం ఆనందంగా మారుతుందనేది ఆయన ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆయన యువతీ యువకులకు ప్రేమోపదేశాలు చేసేవాడు. ప్రేమ వివాహాలను ప్రోత్సహించేవాడు. ఈ క్రమంలో ఆయనకు రోజురోజుకూ అభిమానులు పెరిగిపోయారు. ఆయన అభిమానుల్లో రోమ్ చక్రవర్తి క్లాడియస్ కుమార్తె ఒకరు. ఈ విషయం తెలుసుకున్న రోమ్ చక్రవర్తి క్లాడియస్‌కు భయం పట్టుకుంది. దేశాన్ని కాపాడాల్సిన యువతకు ప్రేమ పాఠాలు నేర్పి బలహీనులుగా తయారు చేస్తున్నాడన్న అభియోగం మోపి వాలంటైన్స్కు మరణ శిక్ష విధిస్తాడు. ప్రేమకు మారుపేరుగా పుట్టిన వాలంటైన్స్ను ఫిబ్రవరి 14న ఉరి తీశారు. ఆయన మరణించిన తర్వాత క్రీస్తు శకం 496లో నాటి పోప్ ‘గెలాసియస్స్’ ఏటా ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే నిర్వహించాలని ప్రపంచానికి పిలుపునిచ్చారు. అప్పటి నుంచి ఏటా వాలంటైన్స్ డే వేడుకలు జరుగుతున్నాయి.
చారిత్రాత్మకమైన ప్రేమ గుర్తులివే…
సహజంగా ప్రేమికులంటే లైలా- మజ్నూ, దేవదాసు- పార్వతి, షాజహాన్- ముంతాజ్ టక్కున గుర్తుకొస్తారు. వాళ్లు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. వారి ప్రేమ కుల, మతాల అడ్డుగోడలను చీల్చుకుని పుట్టింది. రాజరికపు కోటల సరిహద్దులను దాటుకుని విరబూసింది. ప్రేమించిన వ్యక్తితోనే జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నారు. చివరికి పెద్దలు అంగీకరించక పోవడంతో లైలా-మజ్నూ, దేవదాసు-పార్వతి తనువులు చాలించారు. ఇక షాజహాన్ విషయానికి వస్తే ఆయన భార్య ముంతాజ్‌కు ప్రేమకానుకగా ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ నిర్మించాడు.
అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ లవ్ స్టోరీ..
ఖమ్మం అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ ఇటీవల తన వివాహ మహోత్సవం సందర్భంగా కవితాత్మకంగా, దృశ్యమాలికలతో విడుదల చేసిన తన పెండ్లి పత్రిక రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. మనీషాతో తన ప్రేమ ప్రయాణాన్ని వినూత్నంగా వీడియోలో ఆవిష్కరించారు ఈ యువ ఐఏఎస్. ఆ ప్రేమికులకు హ్యాట్సాఫ్. ‘నేను మహబూబాబాద్‌లో ఏఈగా పని చేస్తూ సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నా. నేను నారాయణపేటకు చెందిన ఉపాధ్యాయిని మనీషాను చూసి ఇష్టపడ్డాను. తొలిచూపులోనే ఆమెను ప్రేమించా. సివిల్స్‌లో విజేతగా నిలిచిన తర్వాత ప్రేమను పెళ్లిపీటలు ఎక్కించాలనుకున్నా. ఇప్పుడు ఆమెను జీవిత భాగస్వామిగా చేసుకుంటున్నా’ అని వీడియలో పేర్కొన్నారు రాహుల్. ఈ నెల 10న మహబూబాబాద్‌లో ఆయన వివాహం జరిగింది.
ప్రేమే శాశ్వతం..
ప్రేమ ఆదర్శవంతంగా ఉండాలి.. ఇద్దరి మనసుల కలయిక శాశ్వత బంధానికి ప్రేరణ కావాలి.. ప్రేమే శాశ్వతం.. నేనూ నీలిమ అలాంటి అవగాహనతోనే ప్రేమించుకున్నాం. పెండ్లి చేసుకున్నాం. ప్రేమ వివాహ బాంధవ్యంలో ముందు నుంచే ఒకరికొకరి మధ్య అవగాహన ఉంటుంది. మేం ఇద్దరం కలిసి విద్యాసంస్థలను నిర్వహిస్తున్నాం. ఆదర్శ జీవిత భాగస్వాములుగా జీవితాన్ని సాగిస్తున్నాం. భార్యాభర్తల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు ఉండకూడదు. అపోహలకు తావివ్వకూడదు. ఇంట్లో ప్రశాంతత ఉన్న వారు కెరీర్లో ఎన్నో విజయాలు సాధిస్తారనేది నా విశ్వాసం. –రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్, రెజొనెన్స్, సర్వజ్ఞ విద్యాసంస్థల అధినేత
పెద్దలను ఒప్పించాలి..
నేను నాగేంద్రకుమార్‌ను ప్రేమించాను. మాది ప్రేమ వివాహం. పెద్దలను ఒప్పించి మా ప్రేమను గెలిపించుకున్నాం. అందుకే ఇప్పటివరకు ఎలాంటి అరమరికలు లేకుండా సంతోషంగా జీవిస్తున్నాం. నా భర్త నాకు అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటారు. కష్ట సుఖాల్లో తోడుండి నడిపిస్తారు. ఇది ప్రేమ విజయమే. భార్యాభర్తలిద్దరం పరస్పరం అర్థం చేసుకుంటూ పరిపూర్ణ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాం. యువత నిజమైన ప్రేమను స్వాగతించాలి.
–వేల్పుల విజేత, జిల్లా మహిళా ప్రాంగణాధికారి
ప్రేమ కలకాలం నిలుస్తుంది..
నిజమైన ప్రేమ కలకాలం నిలుస్తుంది. యువతీ యువకులు ఆకర్షణను ప్రేమ అని అనుకోవద్దు. నేను సురేశ్‌ని ప్రేమించాను. కులాంతర వివాహం చేసుకున్నాం. జీవితంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ నిలదొక్కుకున్నాం. విద్య, కెరీర్, రాజకీయ జీవితం సులువుగా ముందుకు సాగడానికి మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ, అవగాహనే కారణం. మా ప్రేమ నిజమైనది. అదే దాంపత్యాన్ని నడిపిస్తుంది. మాకిద్దరు పిల్లలు. శ్రీరామ్ చాణక్య, శ్రీరామ్ అర్జున్. వారి ఆలనా పాలనా చూసుకుంటూ హాయిగా జీవిస్తున్నాం.
– డాక్టర్ బానోతు చంద్రావతి, మాజీ ఎమ్మెల్యే, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు