భారీగా తరలుతున్న జిల్లా వాసులు
తల్లులను దర్శించుకొని బంగారం సమర్పిస్తున్న భక్తులు
కొత్తగూడెం కల్చరల్/కొత్తగూడెం అర్బన్, ఫిబ్రవరి 15 : మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. ఈ నెల 16,17,18,19 తేదీల్లో జాతర ప్రధాన ఘట్టం జరగనుండడంతో జిల్లా కేంద్రం నుంచి వేల సంఖ్యలో ప్రజలు అమ్మవార్లను దర్శించుకునేందుకు కదిలారు. చిన్నాపెద్దా తేడా లేకుండా బయల్దేరడంతో జాతర దారులన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. తల్లులను దర్శించుకొని నిలువెత్తు బంగారాన్ని సమర్పించేందుకు సరిపడా సామగ్రిని వెంట తీసుకెళ్తున్నారు. అందరూ ఆర్టీసీ బస్సుల్లోనే జాతరకు తరలి వెళ్తుండడంతో బస్సులన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. మేడారంలో అమ్మవార్లను దర్శించుకొని తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సుల్లోనే తమ ఇళ్లకు చేరుతున్నారు. మేడారం జాతరకు వెళ్లే వారి కోసం పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు తాగునీరు, మజ్జిగ, పులిహోర పంపిణీ చేస్తున్నాయి. భక్తుల సౌకర్యార్థం వైద్యాధికారులు ప్రత్యేక మెడికల్ శిబిరాలను ఏర్పాటు చేశారు.