ఒకేరోజు మార్కెట్‌కు 70 వేల బస్తాలు రాక
ఎర్ర బంగారంతో కిక్కిరిసిన మిర్చి యార్డు
ప్రశాతంగా కొనసాగిన క్రయవిక్రయాలు
ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 14 : ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల నుంచి తేజా రకం మిర్చి పంట ప్రభంజనం సృష్టిస్తున్నది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో భారీగా పంట చేతికి వస్తున్నది. మార్కెట్లో మంచి ధర లభిస్తుండడంతో రైతులు నేరుగా యార్డుకు పంటను తీసుకొస్తున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం మంచి ధర పలుకుతున్నది. దీంతో కోల్డ్‌స్టోరేజీలో నిల్వ చేసుకునేందుకు రైతులు ఆసక్తి కనబరచలేదు. వారం, పక్షంరోజుల నుంచి జిల్లా రైతులతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాల నుంచి రైతులు పంటను తీసుకొస్తున్నారు. ఈ సంవత్సరం తెల్ల పురుగు ఉధృతి కొంతమేర ఉన్నా.. మిగిలిన ప్రాంతాల్లో ఆశాజనకంగా దిగుబడులు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో తేజారకం పంటకు మంచి డిమాండ్ ఉండడంతో క్వింటాల్‌కు రూ.19 వేలకు పైగానే పలుకుతున్నది. సోమవారం ఉదయం జెండాపాట సమాయానికి వివిధ జిల్లాల నుంచి రైతులు 70 వేల బస్తాలను తీసుకొచ్చారు. ఆదివారం రాత్రి నుంచే పంట యార్డుకు రావడం ప్రారంభమైంది. యార్డుకు పంట భారీగా వచ్చిన విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్పర్సన్ డీ లక్ష్మీప్రసన్న సెక్రటరీ మల్లేశంతో కలిసి జెండాపాటను పర్యవేక్షించారు. భారీగా పంట రావడంతో సాయంత్రం వరకు కాంటాలు, తోలకాల ప్రక్రియ కొనసాగింది.