
ఖమ్మం, ఆగస్టు 24: మంత్రి అజయ్ ఆదేశాల మేరకు ఖమ్మం సుడా పరిధిలో మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంటోంది. సాధ్యమైనంత త్వరలోనే అది ప్రజల ముందుకు రాబోతోంది. మరో 20 ఏళ్లు అంటే 2040 వరకు సుడా పరిధిలోని ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు 7 మండలాలు, 46 గ్రామ పంచాయతీలు, వైరా మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంతాలను కలిపి మొత్తం సుడా నూతన మాస్టర్ ప్లాన్ పరిధిలోకి తీసుకురానున్నారు.2000 సంవత్సరం నుంచి 2020 వరకు రూపొందించిన ఖమ్మం మాస్టర్ ప్లాన్ కారణంగా వివిధ ప్రాంతాల్లోని ప్రజలు, వ్యాపారవేత్తలు పలు రకాల ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఖమ్మంలో రెసిడెన్షియల్ జోన్‌ను కమర్షియల్ జోన్‌గా ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించుకునే వారికి అనుమతులు రాని పరిస్థితి ఉంది. అంతేకాకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో 30 అడుగుల రోడ్లు ఉంటే వాటిని 60 అడుగులుగా విస్తరించడం ద్వారా నివాస ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్, పబ్లిక్ జోన్లను నిర్దేశించడంలో గతంలో అనేక పొరబాట్లు జరిగాయి. వాటి వల్ల నగర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోని తీసుకున్న మంత్రి అజయ్.. రానున్న 20 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చెందే ప్రాంతాలను గమనించి మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తున్నారు.
తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో నూతన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏవో ఆదేశించిన విషయం విదితమే. దీంతో ఖమ్మం సుడా పరిధిలో మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడానికి బెంగళూరు కేంద్రంగా పనిచేసే స్టీమ్ ఏజెన్సీకి బాధ్యత అప్పగించారు..ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు నూతన మాస్టర్ ప్లాన్‌ను ఆ ఏజెన్సీ రూపొందించాల్సి ఉండగా కరోనా పరిస్థితులు, కేఎంసీ ఎన్నికలు నేపథ్యంలో ఆలస్యమైంది. దీంతో మంత్రి పువ్వాడ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం సుడా కార్యాలయంలో స్టీమ్ ఏజెన్సీ ప్రతినిధులతో మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కేఎంసీ కమిషనర్ అనురాగ్ జయంతి సమీక్షించారు. ఇప్పటివరకు రూపొందించిన మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌పై వారు సమీక్షించి స్టీమ్ ఏజెన్సీ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు.
అయితే ఆ ఏజెన్సీ ప్రతినిధులు సుడా పరిధిలోని అన్ని గృహాలకు జియో ట్యాగింగ్, జీఎస్బీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు చేయలేదు. కొన్ని చోట్ల అసంపూర్ణంగా చేశారు. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు నెల రోజుల్లో ఖమ్మం ప్రజల ముందు డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌ను తీసుకరావాలని ఆదేశించారు. ఆ తరువాత డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను కేఎంసీ కౌన్సిల్లో ప్రవేశపెడతారు. అనంతరం సుడా పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు అందజేసి వారి అభిప్రాయాలను తీసుకున్న తరువాత ఫైనల్ మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వానికి పంపి ఆమోదం పొందుతారు. అప్పటి నుంచి నూతన మాస్టర్ ప్లాన్ అమల్లోకి వస్తుంది. ఈ సమీక్షలో మేయర్, సుడా చైర్మన్, కమిషనర్‌తోపాటు స్టీమ్ ఏజెన్సీ ప్రతినిధులు శ్రీకుమార్, కృష్ణ శాస్త్రి, దుర్గా ప్రసాద్, శ్రావణ్ పాల్గొన్నారు.