
విద్యాసంస్థలు పనిచేసే సమయంలో యూనిఫాం, భుజాన పుస్తకాల బ్యాగు, చేతిలో లంచ్ బాక్సుతో బయల్దేవారు పిల్లలు. బడిలో పాఠాలు విని, కొద్దిసేపు ఆటలాడుకొని సాయంత్రం ఇంటికొచ్చేవారు. తరువాత హోంవర్క్‌తో కుస్తీ పట్టేవారు. కరోనా కారణంగా లాక్డౌన్ మొదలై స్కూళ్లు మూతబడిన ఈ రెండేళ్లలో ఇలాంటి దృశ్యాలే లేవు. కానీ తల్లిదండ్రులు అలాగే ఉండిపోలేదు. తమ పిల్లల చదువుల కోసం వారే నిత్య గురువులయ్యారు.
అర్థమయ్యేలా..
ఆన్లైన్ తరగతులు విద్యార్థులకు అత్యధిక శాతం అర్థమయ్యే అవకాశం లేకపోవడంతో మొదట పేరెంట్స్ ఒకటిరెండు సార్లు చదివి పాఠాలను అర్థం చేసుకొని తమ పిల్లలకు గురువులుగా మారి బోధిస్తున్నారు. కరోనా వంటి ఇబ్బందులు వచ్చినా కాలం మన కోసం ఆగదు కాబట్టి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ ఉద్యోగాలను, ఉపాధిని సమన్వయం చేసుకుంటూ పిల్లల క్లాసుల కోసం టైం కేటాయిస్తున్నారు. ఉద్యోగులు సైతం ఆన్లైన్ పాఠాలను రికార్డు చేసుకొని, లేదా తెలుసుకొని సాయంత్రం పిల్లలను చదివిస్తున్నారు. ఆన్లైన్ క్లాసుల వల్ల పిల్లల కోసం తల్లిదండ్రులు ఎక్కువ టైం కేటాయిస్తుండడంతో వారి మధ్య అనుబంధం మరింత బలపడుతోంది. ఇది వరకు ఇలా ఉండేది కాదు.
హోం ట్యూషన్లు..
కళాశాల విద్యార్థులకు పోటీ పరీక్షలు ఉంటుండడంతో పిల్లల కోసం రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు కేటాయించి ప్రత్యేకంగా హోంట్యూషన్లు సైతం పెట్టిస్తున్నారు. ఇంకొందరు యూట్యూబ్ సేవలను వినియోగించుకొని నేర్పుతున్నారు.
80 శాతానికి పైగా హాజరు..
ఖమ్మం జిల్లాలో 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు అందుతున్నాయి. 21 మండలాల్లో 1258 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని 85,750 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్‌లో 30 ప్రాథమిక పాఠశాలలు, 81 ప్రాథమికోన్నత పాఠశాలలు, 181 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 292 స్కూళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు లక్ష మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు. 21 మండలాల్లో కలిపి 2,352 వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ఈ నెల 23న ఆన్లైన్ తరగతుల రికార్డుల ప్రకారం రోజూ 1,976 మంది విద్యార్థులను ఫోన్ ద్వారా, 1,085 మందిని ప్రత్యక్షంగా కలిసి పర్యవేక్షణ చేస్తున్నారు.
ఇది కేవలం కిశోర్‌కుమార్ – సుధారాణి, చావా సంపత్ – హేమ, అశోక్‌రెడ్డి – సరోజిని, జీవిత – కృష్ణ ఇంట్లోనే కనిపిస్తున్న సన్నివేశాలు కావు. ఈ విద్యాసంవత్సరంలో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కనిపిస్తున్న దృశ్యాలు. కరోనా నేపథ్యంలో తల్లిదండ్రులే గురువులుగా తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఆప్యాయత, అనుబంధాలు మరింత పెరుగుతున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలను తెరవనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఆన్లైన్ క్లాసులతో ఇప్పటి వరకూ తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య అనురాగం మరింత బలపడింది.
నగరంలోని మమత రోడ్డులో ఉంటున్న మన్నె కిశోర్‌కుమార్ – సుధారాణి దంపతులకు ఇద్దరు పిల్లలు. వృత్తి రీత్యా కిశోర్‌కుమార్ ఓ విద్యాసంస్థ కరస్పాండెంట్. దీంతో పిల్లల ఆన్లైన్ చదువులను అమ్మ, నానమ్మ చూస్తూ దగ్గరండి నేర్పిస్తున్నారు. పాఠశాలలో చెప్పే పాఠాలు అర్థమయ్యేలా చెప్పడంతో రోజూ వారి హోంవర్క్ చేసేందుకు తోడ్పాటునందిస్తున్నారు.