 
                                                            ఖమ్మం రూరల్/ కూసుమంచి/ ఖమ్మం, అక్టోబర్ 30 : మొంథా తుపాను ప్రభావంతో ఎగువన కురిసిన వర్షాలకు ఖమ్మంలోని మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. వర్షం తగ్గినప్పటికీ గురువారం సాయంత్రం కూడా 26 అడుగుల గరిష్టస్థాయి వద్ద వేగంగా ప్రవహిస్తోంది. దీంతో.. ఇవతలి ఒడ్డున ఉన్న ఖమ్మం నగరంలోని, అవతలి ఒడ్డున ఉన్న ఖమ్మం రూరల్ మండలంలోని, ఏదుపులారం మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. బుధవారం ఒక్కరోజే జలప్రళయం సృష్టించడంతో ముంపు ప్రాంతాల ప్రజలు మూటాముల్లె సర్దుకొని పునరావాస కేంద్రాలకు, ఎగువ ప్రాంతాలకు తరలివెళ్లారు. ముంపు ప్రభావం ఎక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలనూ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
నిరుటి అనుభవం రీత్యా జిల్లా అధికారులు అప్రమత్తమై వెనువెంటనే సహాయక చర్యలు చేపట్టడంతో ఆస్తినష్టం కూడా పెద్దగా జరగలేదు. ముంపు ప్రాంతాల్లోని కుటుంబాల్లో పిల్లలు, వృద్ధులు, మహిళలు గురువారం ఉదయం తమ ఇంటి సరంజామాతో పునరావాస కేంద్రాలకు, తమకు తెలిసిన వారి ఇళ్లకు వెళ్లగా.. పెద్దలు మాత్రం మునిగిన తమ ఇంటి ప్రాంతాల్లోనే ఉంటూ వరద ఎప్పుడు తగ్గుతుందా అని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. మరోవైపు పాలేరు కూడా ఉగ్రరూపం దాల్చింది. పాలేరు జలాశయ నీటిమట్టం 50 వేల క్యూసెక్కులకు చేరువలో ఉంది. దాని పరీవాహకంలోని వడ్డెర కాలనీలోని పలు ఇళ్లలోకి వరద నీరు రావడంతో ఆ కాలనీవాసులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే, ప్రభుత్వం తమకు ఇళ్లు ఇవ్వకుండా ఖాళీ చేయబోమని సదరు కాలనీవాసులు స్పష్టం చేశారు.

వరద తగ్గుముఖం పట్టకపోవడంతో సదరు కాలనీవాసులకు అధికారులు సర్దిచెబుతూనే ఉన్నారు. దాని పరీవాహక ప్రాంతాల్లో వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో మూడు రోజులుగా జలవిలయం తాండవం చేస్తున్నా అక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులుగానీ, పొరుగునే ఉన్న ఉప ముఖ్యమంత్రిగానీ ఇటువైపు తొంగిచూడలేదు. దీంతో ముంపు ప్రాంతాల ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో చివరికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం సాయంత్రం ఖమ్మంలో సుడిగాలి పర్యటన చేశారు. మున్నేరు పాత వంతెనపైకి వెళ్లి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి కంటితుడుపు చర్యగా ఓ పునరావాస కేంద్రానికి వెళ్లి అక్కడున్న వరద బాధితులను పలకరించారు.
తుపాను ప్రభావంతో మంగళవారమే జిల్లాలో వర్షం మొదలైంది. బుధవారం తెల్లవారుజామున నుంచి సాయంత్రం వరకూ ఖమ్మంతోపాటు ఎగువన ఉన్న మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోనూ అత్యంత భారీ వర్షం కురిసింది. దీంతో మున్నేటి వరద ఒక్కసారిగా పెరిగింది. బుధవారం ఉదయం 10 గంటలకు 12 అడుగులుగానే ఉన్న వరద ప్రవాహం అదే రోజు అర్ధరాత్రి 12 గంటలకు 19 అడుగులకు చేరింది. గురువారం తెల్లవారుజాము వరకూ అదే 19 అడుగుల వద్ద కొనసాగిన ప్రవాహం.. ఎవ్వరూ ఊహించని విధంగా వరద అమాంతం పెరిగి గురువారం మధ్యాహ్నానికి 25 అడుగులకు చేరింది. దీంతో ఇవతల ఖమ్మం నగరంలోని బొక్కలగడ్డ, వెంకటేశ్వరనగర్, గణేశ్‌నగర్, మంచికంటినగర్ తదితర ప్రాంతాలతోపాటు అవతల ఏదులాపురం మున్సిపాలిటీలోని రాజీవ్ గృహకల్ప, నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ, జలగంనగర్, డీబీఆర్నగర్, టెంపుల్‌సిటీ కాలనీల్లోని మున్నేటి సమీప ప్రాంతాల్లోని ఇళ్లను వరద చుట్టుముట్టింది. అయితే, అప్పటికే అక్కడి ప్రజలను అధికారులు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. గురువారం సాయంత్రం 6 గంటల వరకు 26 అడుగుల గరిష్టస్థాయి వద్ద మున్నేరు వేగంగా ప్రవహిస్తోంది.
ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ ప్రాంతాల పరిధిలోని మున్నేరు పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడం, పునరావాస కేంద్రాలకు తరలించడం, ప్రాణ, ఆస్తినష్టాలను నివారించేందుకు అక్కడి అధికారులు 36 గంటలపాటు అవిశ్రాంతంగా శ్రమించారు. తహసీల్దార్ రాంప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, సీఐ ముష్కారాజ్ తమ సిబ్బందిని వెంట తీసుకొని రేయింబవళ్లూ వరద ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేసి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల కారణంగా నాలుగు ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోవడంతో అటువైపుగా ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఎగువ జిల్లాలో కురుస్తున్న వర్షానికి పాలేరు జలాశయానికి మళ్లీ వరద పోటెత్తింది. 50 వేల క్యూసెక్కులకు చేరువలో వరద చేరింది. దీంతో పాలేరు వడ్డెర కాలనీ ఇళ్లలోకి నీరు చేరడంతో అక్కడి ప్రజలను ఖాళీ చేయించేందుకు మండల అధికారులు రవికుమార్, రామచందర్‌రావు, వాణి, జ్యోతి, హరి చర్యలు చేపట్టారు. మరోవైపు పాలేరు ఫాలింగ్ గేట్ల వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడికి ఎవరూ వెళ్లకుండా గేట్లకు తాళం వేశారు. పాలేరు ట్యాంక్ బండ్‌పై పోలీసు పహారా ఏర్పాటు చేశారు.

గత సెప్టెంబర్ నాటి వరదల సమయంలో స్వయంగా ఇక్కడికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. తమ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ, ఇంతవరకూ ఇవ్వలేదని పాలేరు వడ్డెర కాలనీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇళ్లు ఇస్తేనే తాము ఇక్కడి నుంచి ఖాళీ చేస్తామని స్పష్టం చేశారు. అయితే, వరద పెరిగి ఇళ్లలోకి నీరు చేరుతున్నందున వెంటనే ఖాళీ చేయాలని అధికారులు కోరినప్పటికీ వారు ససేమిరా అన్నారు. అయితే, సాయంత్రం వరకూ వారికి అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

వరద కారణంగా పెరికసింగారం-రాజేపుట రోడ్డు, నర్సింహులగూడెం-కొత్తూరు రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు వెళ్లకుండా కూసుమంచి-కిష్టాపురం రోడ్డుకు అడ్డుగా అధికారులు ట్రాక్టర్లు పెట్టారు. నాయకన్‌గూడెం పంపుహౌస్ వద్ద తెప్పలను వరదలకు కొట్టుకుపోకుండా ఉంచారు. నాయకన్‌గూడెం స్కూల్ వెనుక కాలనీలోకి కూడా నీరు చేరింది. కాగా, మండలంలో దెబ్బతిన్న పంటలను ఏవో పరిశీలించారు. అలాగే, పాలేరు రిజర్వాయర్‌లోని వరద ఉధృతిని ఇరిగేషన్ ఎస్ఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు పరిశీలించారు. వరద పెరిగే అవకాశం ఉందని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈఈ రమేశ్‌రెడ్డి, డీఈ రత్నకుమారి పాల్గొన్నారు.
 
                            