
పర్ణశాల, సెప్టెంబర్ 7 :ఛత్తీస్‌గఢ్‌కు రాష్ట్ర సరిహద్దుకు మధ్య దట్టమైన అటవీప్రాంతంలో ఉన్న కుగ్రామం ములకనాపల్లి కొత్తగుంపు.. దుమ్ముగూడెం మండల కేంద్రానికి దూరంలోని పైడిగూడెం పంచాయతీ పరిధిలో ఇది ఒక పూర్తిస్థాయి గొత్తికోయల గూడెం.. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ గూడెం ప్రజలకు ప్రస్తుతం మౌలిక వసతులు అందాయి.. ఈ నేపథ్యంలో గూడేనికి సమకూరిన వసతులపై ప్రత్యేక కథనం.
స్వరాష్ట్రంలో వసతులు..
దుమ్ముగూడెం మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటంది ములకానపల్లి కొత్తగుంపు. గూడెంలో 30 కుటుంబాలు నివసిస్తుండగా జనాభా 100. అందరూ గొత్తికోయలే. గూడెమంతా వ్యవసాయాధారిత కుటుంబాలే. వ్యవసాయం కాక ఇంకా పశుపోషణపై ఆధారపడతారు. ముఖ్యంగా గూడెంవాసులు పోడు వ్యవసాయం చేస్తుంటారు. వీరు ఎక్కువగా నువ్వులు, జొన్నలు, అపరాలు చేస్తారు. దిగబడులను ఛత్తీస్‌గఢ్‌లోని కిష్టారం, గొల్లపల్లి సంతల్లో విక్రయిస్తుంటారు. ఫలసాయాన్ని తిరిగి తమకు కావాల్సిన నిత్యావసర సామగ్రి, గృహోపకరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో గూడెంవాసులు నిరాదరణకు గురయ్యేవారు. కనీస వసతులకూ నోచుకునేవారు కాదు. మౌలిక వసతులకు ఇబ్బందిపడేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గూడేనికి మౌలిక వసతులు వచ్చాయి. విద్యుత్‌శాఖ అధికారులు గ్రామానికి సింగిల్ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతో ప్రతి ఇంటికి నాణ్యమైన విద్యుత్ అందుతున్నది. గ్రామంలో సోలార్ సిస్టంలో ఏర్పాటు చేసిన మోటారు ద్వారా గూడెంలో అన్ని ఇళ్లకు మంచినీరు సరఫరా అవుతున్నది. గ్రామంలో 80శాతానికి పైగా కుటుంబాలకు రేషన్‌కార్డులు ఉన్నాయి. ఇటీవల ఈ గిరిజన గూడెంలో రాష్ట్ర గిరిజనశాఖ ఉన్నతాధికారులు పర్యటించారు. మౌలిక వసతుల కల్పన, ఆరోగ్యపరిస్థితులపై ఆరా తీశారు. గొత్తికోయలకు దీర్ఘకాలిక వ్యాధులు లేకపోవడం, కరోనా కేసులు నమోదుకాకపోవడాన్నియ గుర్తించారు.
రహదారి ఏర్పాటు చేయాలి..
మా గూడేనికి రహదారి సౌకర్యం కల్పించాలి. మేం దట్టమైన అటవీప్రాంతంలో ఉంటున్నాం. రవాణాసౌకర్యాన్ని కోరుకుంటున్నాం. గ్రామంలో 15 మంది చిన్నారులు ఉన్నారు. వారి కోసం అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
-రవ్వ జోగారావు, ములకనాపల్లి కొత్తగుంపు