ఆరెకరాల విస్తీర్ణంలో రూ.30 కోట్లతో ఎస్టీపీ నిర్మాణం
త్వరలో శంకుస్థాపన చేయనున్న మంత్రులు కేటీఆర్, అజయ్‌కుమార్
ఖమ్మం, ఫిబ్రవరి 21 : ఖమ్మం కార్పొరేషన్లో దాదాపు 4 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. రోజూ 60 ఎంఎల్డీ (60 మిలియన్ లీటర్లు) నీటిని వివిధ అవసరాలకు ప్రజలు వినియోగిస్తున్నారు. దీనిలో 80శాతం నీరు అంటే 48 ఎంఎల్డీ నీరు వాడకం తర్వాత బయటకు వస్తుంది. ఈ నీరంతా వివిధ రూపాల్లో మురుగు కాల్వల ద్వారా మున్నేరు, చెరువుల్లో కలుస్తున్నది. దీంతో నీరు, పరిసరాలు కలుషితమవుతున్నాయి. పశువులు, మనుషులు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రజలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో మంత్రి కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మురుగునీటి శుద్ధి కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఖమ్మం నగరంలోని ధ్వంసలాపురం వద్ద ఈ కేంద్రాన్ని నిర్మించనున్నారు. దీని నిర్మాణానికి ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది.
ఖమ్మం నగరాన్ని అధికారులు మూడు భాగాలుగా విభజించారు. మురుగునీరు ప్రవహించే విధానం, కాల్వలు పారే విధానాన్ని పరిగణలోకి తీసుకొని మూడు భాగాలుగా విభజించారు. ముందుగా త్రీటౌన్ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో ఎఫ్‌సీఐ ప్రాంతం నుంచి ధ్వంసలాపురం వరకు ఒకప్పటి సాగునీటి కాలువైన గోళ్లపాడు చానల్ కాల్వ ఉండేది. రాను రాను అది మురుగుకాల్వగా రూపాంతరం చెందింది. దీనిద్వారా అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడిన విషయం తెలిసిందే.. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ కాల్వపై పర్యటించి ఆధునీకరణకు రూ.70 కోట్లు మంజూరు చేశారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు ఈ పనులు పూర్తికావొచ్చాయి. త్రీటౌన్‌లోని మొత్తం మురుగునీరు గోళ్లపాడు చానల్ ద్వారా మున్నేరులో కలుస్తున్నది. దీని ద్వారా అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇక ముందు మురుగునీరు మున్నేరులో కలువకుండా పైప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ప్రజల వాడకం నుంచి వచ్చే మురుగునీరు గోళ్లపాడు చానల్ కాల్వలో అంతర్భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా ధ్వంసలాపురం వద్ద నూతనంగా నిర్మించే మురుగునీటి శుద్ధి కేంద్రానికి చేరుతుంది. మురుగునీరు పారడానికి ఒక పైప్‌లైన్, వర్షాకాలంలో వర్షపు నీరు ప్రవహించడానికి దానిపక్కనే మరో కాల్వ నిర్మించారు. వర్షం వచ్చిన సందర్భంలో వర్షపునీరు మాత్రమే మున్నేరులోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.
త్వరలోనే పనులు ప్రారంభం
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని ధ్వంసలాపురం వద్ద రూ.30 కోట్లతో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నాం. మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్ శంకుస్థాపన చేసిన తర్వాత పనులను ప్రారంభిస్తాం.. మురుగునీటి, దోమల బెడద ఉండదు. పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం. నగరంలో మూడుచోట్ల ఇలాంటి కేంద్రాలను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించాం. ముందుగా త్రీటౌన్ ప్రాంతానికి ఉపయోగపడేలా దీనిని నిర్మిస్తున్నాం.
– ఆదర్శ్ సురభి, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్