గిరిజనులకు రాజశ్రీ కోళ్ల పంపిణీలో గవర్నర్ తమిళిసై
అశ్వారావుపేట, దమ్మపేటల్లో 80 కుటుంబాల ఎంపిక
అశ్వారావుపేట, ఫిబ్రవరి 12: మారుమూల గ్రామాల్లో నివసించే కొండరెడ్ల గిరిజనులు ఆర్థికంగా బలోపేతం కావాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. ఇందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అశ్వారావుపేట మండలం గోగులపూడి, దమ్మపేట మండలం పూచికుంట గ్రామాల్లోని 80 కొండరెడ్ల కుటుంబాలకు రాజశ్రీ కోళ్లను హైదరాబాద్‌లో శనివారం ఆమె పంపిణీ చేశారు. పౌష్టికాహార లోపంపై గవర్నర్ ఇటీవల ప్రత్యేకంగా సర్వే నిర్వహించారు. సర్వే గ్రామాల్లో కొండరెడ్ల కుటుంబాల్లో పౌష్టిహాకార లోపం నివారణకు ప్రత్యేక దృష్టి సారించారు. కార్యక్రమం అమల్లో భాగంగా పీవీ నరసింహారావు పశు వైద్య విశ్వ విద్యాలయంలో న్యూట్రిషియన్ ఇంటివెన్షన్ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. ఒక్కొక్క కుటుంబానికి 10 రాజశ్రీ కోళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొండరెడ్లు అన్ని రంగాల్లో రాణించాలని, ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పౌష్టికాహారం తీసుకోవాలని గవర్నర్ సూచించినట్లు కొండరెడ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ముర్ల రమేశ్ తెలిపారు. కొండరెడ్ల సమస్యలపై వినతిపత్రాన్ని సైతం అందజేసినట్లు చెప్పారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ బాధ్యులు యోగి సూర్యనారాయణ, వార్డు సభ్యులు గోగుల మంగిరెడ్డి, కొండరెడ్లు గురుగుంట్ల బాబురెడ్డి, ఉమ్మల నాగరాజురెడ్డి, యాట్ల రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.