బీమా పరిహారం లేకపోతే అరిగోస పడేటోళ్లం
20 ఏండ్ల అప్పులు ఒక్కసారే తీరిపోయినయ్
నాలుగు కుంటల భూమి నా కుటుంబాన్ని కాపాడుతదనుకోలేదు
‘రైతు బీమా’ లబ్ధిదారురాలు కలకోటి సుగుణమ్మ
ఖమ్మం, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. కూలుతున్న కుటుంబాన్ని ఆదుకున్న దేవుడాయన. కట్టుకున్నోడు మమ్మల్ని వదిలిపోయిండు. అప్పటి వరకు చేసిన అప్పులు మమ్ములను వెంటాడినయ్. ఏం చేయాల్నో తెలియక ఆలోచనలో పడ్డ నాకు.. రైతుబీమా వరమైంది. నా భర్త చనిపోయిన వారం రోజుల్లోనే ఆయన పేరిట ఉన్న భూమికి రైతుబీమా పథకం క్రింద రూ.5 లక్షల బీమా పరిహారం మంజూరైంది. ఆ మొత్తం నగదు నామినీ అయినా నా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. ఆ సమయంలో అనిపించింది సీఎం కేసీఆర్.. నాకు, నా బిడ్డలకు దేవుడిలాంటి వాడని. వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చాను. మరికొన్ని డబ్బులతో గేదెలు కొనుక్కొని పాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. అంతలోనే ఒక్కగానొక్క కొడుకుపై చెట్టు పడింది. దీంతో అతడి వెన్నుపూస విరిగిపోయింది. అప్పుడూ కేసీఆర్ సార్ సాయమే అక్కరకొచ్చింది. ఆ డబ్బులతోనే కొడుక్కి ఆపరేషన్ చేయించి బతికించుకున్నా. కానీ కొన్నాళ్లకే కొడుకూ దూరమయ్యాడు. ఇప్పుడు ముసలితనంతో చేసే ఓపిక లేక ఉన్న నాలుగు డబ్బులతోనే ఇంటి వద్దనే ఉంటూ బతుకుతున్నా..’ అంటోంది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రేగులచలక గ్రామానికి చెందిన రైతుబీమా లబ్ధిదారురాలు కలకోటి సుగుణమ్మ. ‘
రైతు బీమా’ ద్వారా వచ్చిన డబ్బులతో జీవిస్తున్న సుగుణమ్మను బుధవారం ‘నమస్తే తెలంగాణ’ కలిసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన డబ్బులతో సంతోషంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చిందామె. ‘రఘునాథపాలెం మండలం రేగులచెలక గ్రామానికి చెందిన ఎస్సీ కుటుంబం మాది. వారసత్వం కింద అత్తామామలు మా ఆయనకు నాలుగు కుంటల భూమి ఇచ్చారు. ఆ కొంచెం భూమిని సాగు చేసుకుంటూ, మధ్య మధ్యలో కూలి పనులు చేసుకుంటూ పిల్లలను సాకుతున్నాం. ఇద్దరు కూతుళ్లు. ఒక కొడుకు. అప్పట్లో ఆడపిల్లల పెళ్లిళ్లు చేసే సమయంలో తెలిసినోళ్ల దగ్గర కొంత అప్పులు తీసుకరాక తప్పలేదు. ఒక వైపు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ.. మరోవైపు ఇల్లు వెళ్లదీసుకుంటూ వచ్చాం. రానురానూ నా భర్తకు కూలి పనులు చేసే శక్తి కూడా లేకపోయింది. 58 ఏళ్లు వచ్చాయి. ఇద్దరికీ బీపీ, షుగర్ వచ్చాయి. అయినప్పటికీ ఎలాగోలా కటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చాం. చేసిన అప్పులు ఎలా తీర్చాంటూ నా భర్త ఎప్పుడూ బాధ పడుతుండే వాడు, ఆలోచిస్తూ ఉండేవాడు. ఎంతలా ఆలోచించాడో ఏమో ఒకరోజు రాత్రి గుండెపోటు వచ్చింది. ‘ఏమయింది?’ అని ఇంటిపక్క వాళ్లు అడిగేలోపే ఆయన కన్నుమూశారు. ఇల్లు తప్ప నాకు బయట ప్రపంచం తెలియదు. ఇక ఈ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలని మరుసటి రోజు నుంచి నేనూ, నా కొడుకు బాధపడ్డాం. చేతిలో చిల్లిగవ్వ లేదు. కనీసం కర్మకాండలు ఎలా చేయాలో అనుకుంటూ కుమిలిపోయాం.’ అంటూ ఆనాటి కష్టాల సుడిగుండాలను ఒక్కొక్కటిగా వివరించిందామె.
బీమా లేకపోతే నిలువ నీడ కూడా ఉండేది కాదు..
‘తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం లేకపోతే మాకు నిలువ నీడ కూడా ఉండేది కాదు. ఉన్న నాలుగు కుంటల భూమి అమ్మినా బీమా పరిహారం కంటే చాలా తక్కువే వచ్చేవి. నయా పైసా ఖర్చు లేకుండా తక్కువ రోజుల్లోనే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.5 లక్షల బీమా పరిహారం అందించారు సీఎం కేసీఆర్ సార్. వచ్చిన ఆ డబ్బులతో ఉన్న అప్పులు తీర్చాను. మిగిలిన కొద్ది డబ్బులను కొడుకు కోసం ఉంచాను. తరువాత వాడికి ప్రమాదం జరిగినా అదే డబ్బులతో ఆసుపత్రిలో చూపించా. కానీ ఫలితం లేకపోయింది. కొన్నాళ్లకు వాడూ చనిపోయాడు. ఏ తల్లి కన్న బిడ్డో తెలియదు కానీ సీఎం కేసీఆర్ సార్ మమ్మల్ని ఎంతో ఆదుకుండు. ఆయనను కన్న తల్లికి కాళ్లు మొక్కాలే. మగ దిక్కు లేని కుటుంబానికి పది రూపాయల సాయం చేయని వాళ్లున్న ఈ రోజుల్లో రూ.5 లక్షలు ఇచ్చి కేసీఆర్ సారు మా కుటుంబాన్ని ఆదుకుండు. మా లాంటి ఎన్నో కుటుంబాలకు ఈ పథకం ఉపయోగపడుతున్నది.’ అంటూ పైట కొంగుతో కళ్లు తుడుచుకుందామె.
మా కుటుంబానికి దేవుడు సీఎం కేసీఆర్..
‘మా కుటుంబనికి దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఉన్న కొంతభూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చిండు. పంట పండించుకునేందుకు పెట్టుబడి సాయం చేసిండు. మా ఆయన చనిపోయినంక బీమా పరిహారం ఇచ్చి ఆదుకున్నడు. బీమా పైసలు రాకపోతే నేను ఏ స్థితిలో ఉండేదాన్నో ఏమో. నాలాంటి తల్లులకు చేసిన సాయం ఎక్కడికీ పోదు.
–కలకోటి సుగుణమ్మ, రేగులచెలక, రఘునాథపాలెం మండలం