ఖమ్మం, మే 7: కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరంగల్ జరిగిన సభ రైతు సంఘర్షణ సభ కాదని, రైతు ఆత్మ సంఘర్షణ సభ అని టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని ధ్వజమెత్తారు. ఖమ్మంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఆరు దశాబ్ధాలపాటు కాంగ్రెస్ పాలన కొనసాగిందని, ఆ పార్టీ ప్రభుత్వ హయాంలోనే దేశంలో రైతులు అత్యధిక సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. వరంగల్ సభలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన తీరు గురివింద సామెతలా ఉందని తాతా మధు ఎద్దేవా చేశారు. ఇక్కడ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను దేశంలోని కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. మరి తెలంగాణలో అమలవుతున్న పథకాలను కాంగ్రెస్, తన మిత్రపక్షాలతో అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా పథకాలను ఎందుకు అమలు చేయడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ రిమోట్ బీజేపీ చేతుల్లో ఉందంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని అన్నారు. రేవంత్‌రెడ్డి రిమోట్ ఎవరి చేతుల్లో ఉందో రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు. వలసవాదులకు తొత్తుగా మారిన వారికి టీఆర్ఎస్ను విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. యూపీ, పంజాబ్‌లో రైతులు కాంగ్రెస్‌కు ఎలా బుద్ధి చెప్పారో ఇకనైనా తెలుసుకోవాలని హితవు చెప్పారు. జీడీపీలో, కుటుంబ ఆదాయంలో, గ్రామీణ అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్రమే తన నివేదికలో చెపుతున్న విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకున్నా కాళేశ్వరం లాంటి అద్భుత ప్రాజెక్టులతోపాటు తెలంగాణలో అనేక ప్రాజెక్టులను నిర్మించి బీళ్లుగా ఉన్న భూములను పచ్చని బంగారంలా తయారు చేసిన గొప్ప చరిత్రను కేసీఆర్ సృష్టించారని అన్నారు. రాజీవ్‌గాంధీ లాంటి నేతలు పార్లమెంట్లో ఉండి పూర్తి మెజారిటీ ఉన్న సమయంలోనైనా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. వలసవాదులకు కొమ్ముకాసిన కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ను విమర్శించడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని అన్నారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులకు న్యాయం చేసింది సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేఎంసీ మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు కమర్తపు మురళి, కర్నాటి కృష్ణ పాల్గొన్నారు.