ఖమ్మం వ్యవసాయం, జూన్ 15:రాష్ట్ర మార్కెటింగ్‌శాఖలో తనదైన శైలిలో దూసుకుపోతోంది ఖమ్మం వ్యవసాయ మార్కెట్. ఈ క్రమంలో కర్షకులకు తాను అందించిన సేవలకు గాను మరో అవార్డు లభించింది. హైదరాబాద్ బోయినపల్లి మార్కెట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఖమ్మం ఏఎంసీ సెక్రటరీ ఆర్.మల్లేశం.. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నుంచి అవార్డు అందుకున్నారు. మార్కెటింగ్ శాఖలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న పలు రైతుబజార్లు, వ్యవసాయ మార్కెట్లకు ఏటా మార్కెటింగ్‌శాఖ అవార్డులతో సత్కరించడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఈ సంవత్సరం మార్కెట్ రాబడిలో లక్ష్యానికి మంచి ఆదాయాన్ని ఖమ్మం మార్కెట్ సొంతం చేసుకుంది.
నిరుడు మార్కెట్ ఆదాయ లక్ష్యం రూ.17 కోట్లకు గాను రూ.20 కోట్లకు పైగా సాధించింది. అదే విధంగా జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం, ఈ-టామ్ విధానం వంటివి విజయవంతంగా అమలు జరుగుతున్నాయి. వీటితోపాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సహకారంతో వ్యాపారులు, కార్మికులు, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన వసతులు కల్పించారు. దీంతో ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ ఖమ్మం మార్కెట్‌కు రెండో ర్యాంకును కేటాయించి అవార్డును ప్రదానం చేసింది.
జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేలా పనిచేస్తాం..
రాష్టంలోని 191 వ్యవసాయ మార్కెట్లలో ఖమ్మం మార్కెట్‌కు రెండో ర్యాంకు రావడం సంతోషాన్నిచ్చింది. ఈ ఖ్యాతి రావడానికి ప్రధాన కారకుడు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. ఆయన సహకారం మరువలేనిది. మా పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ సహకరిస్తున్న వ్యాపారులు, కార్మికులు, రైతులు, ఉద్యోగులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మార్కెట్‌కు పంటను తీసుకొచ్చిన ప్రతి రైతుకూ మంచి ధర కల్పించడమే ప్రధాన ధ్యేయం. అందుకు అనుగుణంగానే ఈ సంవత్సరం అన్ని రకాల మంటలకు రికార్డు స్థాయి ధరలు ఖమ్మం మార్కెట్లోనే పలికాయి. రానున్న రోజుల్లో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకరావడమే ధ్యేయంగా పని చేస్తాం.
–లక్ష్మీప్రసన్న, చైర్పర్సన్, ఖమ్మం ఏఎంసీ