ఏప్రిల్ 10న శ్రీరామనవమి, 11న పట్టాభిషేకం
అదే నెల 2 నుంచి 16 వరకు ప్రయుక్త బ్రహ్మోత్సవాలు
భద్రాచలం, ఫిబ్రవరి 21: భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కరోనా కారణంగా రెండేళ్లుగా శ్రీరామనవమి ఉత్సవాలు, ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు అంతరంగికంగా ఆలయం ప్రాంగణంలోనే జరిగాయి. ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ 10న నిర్వహించేందుకు దేవస్థానం వైదిక కమిటీ.. ఈవో శివాజీకి సోమవారం నివేదికను అందజేసింది. దాని వివరాల ప్రకారం.. ఏప్రిల్ 2న శుభవృత్ నామ సంవత్సర ఉగాది పండుగ, సాయంత్రం నూతన పంచాంగ శ్రవణం, తిరువీధి సేవ నిర్వహిస్తారు. 6న బుధవారం ఉత్సవమూర్తులకు ఉదయం విశేష స్నపనం, సాయంత్రం అంకురారోపణం, తిరువీధి సేవ, 7న ఉదయం ధ్వజపట భద్రక మండల లేఖనం, సాయంత్రం గరుడాధివాసం, తిరువీధి సేవ, 8న ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, చతుః స్థానార్చనం, సాయంత్రం భేరీ పూజ, దేవతాహ్వానం, బలిహరణం, హనుమద్వాహన సేవ, 9న సాయత్రం ఎదుర్కోలు ఉత్సవం, గరుఢ వాహన సేవ, 10న శ్రీరామ నవమి, ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు శ్రీసీతారాముల తిరు కల్యాణోత్సవం, సాయంత్రం రామ పునర్వసు దీక్షలు ప్రారంభం, చంద్రప్రభ వాహనసేవ, 11న శ్రీరామ మహాపట్టాభిషేకం, రాత్రికి రథోత్సవం, 12న రాత్రికి సదస్యం (మహదాశీర్వచనం), హంస వాహన సేవ, 13న రాత్రికి తెప్పోత్సవం, చోరోత్సవం, అశ్వవాహన సేవ, 14న రాత్రికి ఊంజల్ సేవ, సింహ వాహన సేవ, 15న ఉదయం వసంతోత్సవం, సాయంత్రం గజవాహన సేవ, 16న ఉదయం చత్రతీర్థం, సాయంత్రం పూర్ణాహుతి, శేష వాహన సేవ, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశారాథనలు, శ్రీపుష్పయాగం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అవుతాయి.
ఏప్రిల్ 2 నుంచి నిత్యకల్యాణాలు రద్దు..
ఏప్రిల్ 2 నుంచి 16 వరకు శ్రీరామనవమి ప్రయుక్త బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. కాబట్టి ఈ 15 రోజులూ స్వామివారికి నిత్య కల్యాణాలు రద్దవుతాయి. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని దేవస్థానం ఈవో కోరారు. అలాగే ఏప్రిల్ 6 నుంచి 16 వరకు స్వామివారికి దర్బారు సేవలు కూడా ఉండవు. ఏప్రిల్ 6 నుంచి 23 వరకు పవళింపు సేవలు సైతం దద్దవుతాయి. ఏప్రిల్ 24న తిరిగి నూతన పర్యంకోత్సవం ప్రారంభమవుతుంది. మే 7న శ్రీరామ పునర్వసు దీక్షా విరమణ, రథోత్సవం, 8న పట్టాభిషేకం ఉంటాయి.