బడుగుల జీవితాల్లో వెలుగులు
సంక్షేమంతోపాటు విద్యారంగానికి పెద్దపీట
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ రామారావు
ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి15 : తెలంగాణ సర్కారు ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమ బోధన ప్రవేశపెట్టడంపై అన్నివర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు. బంగారు తెలంగాణలో ప్రతీ పల్లె, కుటుంబం తలెత్తుకొని బతికేలా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. పేదవిద్యార్థులకు కార్పొరేటు విద్యనందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. సంక్షేమంతోపాటు విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగుతోపాటు ఆంగ్ల మాధ్యమం బోధించేందుకు ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆంగ్లమాధ్యమ నిర్ణయంపై నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ రామారావును ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు..
నమస్తే : ఆంగ్ల విద్యాబోధనతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?
కేఎస్ రామారావు : గ్రామీణ విద్యార్థులు వెనుకబాటుతనం, మానసిక కుంగుబాటు జయించాలంటే పూర్తిస్థాయి విద్యావకాశాలు రావాలి. గత ప్రభుత్వాలు సక్సెస్ స్కూల్స్ పేరిట కొన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినా.. పూర్తిస్థాయిలో ఫలాలు ఇవ్వలేకపోయాయి. ప్రతీ గ్రామంలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలున్నాయి. వాటిలో కేవలం తెలుగు మాధ్యమం మాత్రమే ఉన్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల పిల్లల చదువుకు ఏకైక వనరు ప్రభుత్వ పాఠశాలే. ఆంగ్ల మాధ్యమ బోధనతో ఈ పిల్లలు ఉన్నత విద్యనభ్యసించే అవకాశం ఉంది.
నమస్తే : ప్రభుత్వ నిర్ణయం పిల్లల భవిష్యత్‌కు భరోసానిస్తుందా?, దేశంలో విద్యాప్రమాణాలు ఎలా ఉన్నాయి?
కేఎస్ : మారుతున్న పరిస్థితుల్లో ప్రతి కుటుంబం తమ పిల్లలను విద్యావంతులను చేయాలని భావిస్తున్నది. పాఠశాల విద్య తర్వాత కాలేజీ, యూనివర్సిటీ స్థాయిలో చదువుతారనే నమ్మకం ప్రజల్లో కలగాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాలయాల్లో ఉత్తమ నాణ్యత ప్రమాణాలు, ఉన్నత విద్యనభ్యసించాలనే ఆకాంక్ష అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నది. ప్రపంచీకరణతో ప్రపంచమంతా ఒకే గ్రామంగా మారింది. వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక మార్పుల వల్ల ఉపాధి అవకాశాలు గ్రామ, జిల్లా పరిధి దాటి నగర, అంతర్జాతీయస్థాయి కార్పొరేట్ సంస్థల్లో పెరుగుతున్నాయి.
నమస్తే : నాణ్యమైన విద్యకు తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి?
కేఎస్ : నగరాల్లో అధిక వ్యయం చేసి ఉన్నత సాంకేతిక విద్య అభ్యసించినవారికే ఉపాధి లభిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యను బలోపేతం చేసేందుకు కృషి చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకులాలను స్థాపించి వాటిలో ఇంటర్‌విద్యను అందిస్తోంది. కస్తూర్బా విద్యాలయాలను అప్‌గ్రేడ్ చేసి బాలికల ఉన్నత విద్యకు బాటలు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం నాణ్యమైన విద్యకు దోహదం చేస్తుంది.
నమస్తే : ఈ నిర్ణయం డ్రాప్ అవుట్స్‌ను అదుపు చేయగలుగుతుందా..?
కేఎస్ : స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పాఠశాల విద్యలో డ్రాప్‌అవుట్ సమస్య పీడిస్తూనే ఉంది. డ్రాప్ అవుట్ నిర్మూలనకు గతంలో చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. ప్రభుత్వ కాలేజీల్లో ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, బస్‌పాస్‌లు ప్రవేశపెట్టి ఇంటర్ విద్యను అందుబాటులోకి తెచ్చింది. కరోనా విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రభుత్వం విద్యాక్యాలెండర్లో మార్పులు చేసి, సిలబస్ తగ్గించి పైతరగతులకు అవకాశం కల్పించడంతో ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి.
నమస్తే : ఇంగ్లిష్ మీడియంతో ఒనగూరే ప్రయోజనాలు?
కేఎస్ : మధ్యాహ్న భోజన పథకం, సన్నబియ్యం సరఫరా పౌష్టికాహారం తదితర చర్యలతో బడీడు పిల్లలను పాఠశాలకు రప్పించినా. పదోతరగతి తర్వాత డ్రాప్ అవుట్స్‌ను తగ్గించడం సవాల్‌గానే మిగిలింది. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుతోపాటు ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల గ్రామీణ విద్యార్థులు ఇంగ్లిష్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారు. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం చదివినవారు కళాశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులతో పోటీపడలేమనే ఆత్మనూన్యత భా వంతో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలకు దూరమవుతున్నారు. ఇప్పుడు వారు ఇంగ్లిష్ మీడియంలో చదవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
నమస్తే : ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల్లో ఆంగ్లం బోధించే నైపుణ్యం ఉందా..?
కేఎస్ : ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ అర్హత, శిక్షణ పొందినవారు. వారందరికీ వృత్త్యంతర నిర్బంధ ఇంగ్లిష్ మీడియం శిక్షణ ఇచ్చి వారితో ఇంగ్లిష్ మీడియం పాఠాలు బోధింపజేయడం ప్రభుత్వానికి సుసాధ్యమే.