నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం ఆకాంక్ష
ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
ఆళ్లపల్లిలో వంద ‘డబుల్ బెడ్రూం’ గృహ ప్రవేశాలు
ఎమ్మెల్యే రేగా సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన సీపీఐ, కాంగ్రెస్ కార్యకర్తలు
ఆళ్ళపల్లి, ఫిబ్రవరి 15: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. ఆళ్లపల్లి మండలంలోని మర్కోడు, ఆళ్లపల్లి గ్రామాల్లో వంద డబుల్ బెడ్ రూం ఇళ్ల గృహ ప్రవేశాలు మంగళవారం సంబురంగా జరిగాయి. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా మొట్టమొదటగా ఆళ్లపల్లికి వచ్చిన రేగా కాంతారావుకు ఎంపీపీ కోండ్రు మంజుభార్గవి, టీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు తిలకం దిద్ది, హారతులు పట్టి స్వాగతం పలికారు. అనంతరం ఆయా గ్రామాల్లో శిలఫలకాలను ఆయన ఆవిష్కరించారు. ఇళ్ల ముందు రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. అనంతరం గృహపత్రాలను అందజేశారు. మర్కోడులో 40, ఆళ్లపల్లిలో 60 ఇళ్లను ప్రారంభించారు. ఆళ్లపల్లి పీహెచ్సీ పరిధిలో నూతనంగా నిర్మించిన పీహెచ్సీ క్వార్టర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు. అనంతరం సభా వేదికలో కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
టీఆర్ఎస్లో చేరికలు
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మర్కోడు ఎస్సీ కాలనీకి చెందిన 50 కుటుంబాల వారు ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. కీసరి నరేశ్ ఆధ్వర్యంలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన వారికి ఎమ్మెల్యే రేగా గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎంపీపీ మంజుభార్గవి, జడ్పీటీసీ హనుమంతరావు, పీఏసీఎస్ చైర్మన్ రామయ్య, ఎంపీడీవో మంగమ్మ, తహసీల్దార్ సాదియా సుల్తానా, ఐటీడీఏ ఈఈ తాటోజ్, డీఈ రాజు, పీఆర్ ఏఈ అఖిల్, మిషన్ భగీరథ ఇంట్రా ఏఈ కిశోర్, డాక్టర్ సాగర్, వైస్ ఎంపీపీ ఎల్లయ్య, సర్పంచులు శంకర్‌బాబు, నరసింహారావు, వెంకటనారాయణ, ప్రేమకళ, నిర్మల, కోటేశ్వరరావు పాల్గొన్నారు.