మంథని, ఏప్రిల్ 10: కాంగ్రెస్ పాలనలో ఇసుక, మట్టి, బియ్యం మాఫియా రాజ్యమేలుతున్నదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధూకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఎన్నికల ముందు తనపై అడ్డగోలుగా ఆరోపణలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటినా ఆధారాలు ఎందుకు చూపడంలేదు?’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఇసుక క్వారీలు ఆదాయ వనరులు గా ఉండేవని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ అక్రమంగా క్వారీలు నడిపిస్తున్నారని ఆరోపించారు.
2018, 2023 లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ నేతలు రాబోయే ఎన్నికల్లో వారికి ఎదురు లేకుండా చూసేందుకు న న్ను చంపేందుకు కూడా కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తన పదవీ కాలం ముగిసిన వెంటనే గన్మెన్లను తొలగించి హతమార్చేందుకు పథకం రూపొందించారని ఆరోపించారు. మంథనిలోని రాజగృహలో బుధవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వా త అక్రమ దందాలు జోరుగా సాగుతున్నాయని, నియోజకవర్గంలో నిత్యం ఏదో ఒక చోట ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీలు పట్టుబడుతున్నాయన్నారు.
పోలీస్స్టేషన్లలో సైతం పైరవీల కోసం ప్రత్యేకంగా ఇన్చార్జిలను నియమించారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తనపై ఇసుక లారీలు, క్వారీలు ఉన్నాయని ఆరోపించారని, ప్రస్తుతం వారి ప్రభుత్వమే అధికారంలో ఉందని, ఆరోపణలు ఎందుకు రుజువు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు నమ్మి ప్రజలు నరకం అనుభవిస్తున్నారన్నారు. మంథని ప్రజల ఆశీర్వాదంతో బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్గా ఎదిగిన తనపై కాంగ్రెస్ నేతలు ఓర్వలేక తప్పుడు ప్రచారం చేసి ప్రజల నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ఇక్క డి ప్రజలు చైతన్య వంతులై తనపై చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపించాలని కాంగ్రెస్సోళ్లను ప్రశ్నించాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు జక్కు రాకేశ్, తగరం శంకర్లాల్, ఆరెపల్లి కుమార్, ఎరుకల రవి పాల్గొన్నారు.