Kalvakuntla Vidyasagar Rao | కోరుట్ల, జనవరి 15: బీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు విద్య, ఉపాధి రంగాల్లో పెద్దపీట వేసిందని, ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక ప్రగతికి బాటలు వేసిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే సమక్షంలో బారీ సంఖ్యలో యువకులు గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా 22వ వార్డుకు చెందిన టేకుల నరేష్ తన మద్దతుదారులు, యువకులు సుమారు వంద మందితో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరగా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న పార్టీ అని పేర్కొన్నారు. యువతకు ఉపాధి, అభివృద్ధి, భవిష్యత్ ఉపాధి అవకాశాల కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను చూసే యువత పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. యువత రాజకీయాల్లో చేరి తమదైన పాత్ర పోషించాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో యువత చూపిన పోరాట పటిమ స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ ఆంధ్ర పాలకుల వివక్షకు గురైందని, బియ్యంతో సహా నిత్యవసరాలన్ని ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చేవని గుర్తు చేశారు. ఎందరో త్యాగదనుల ఉద్యమ ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సహకారమైందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశానికి అన్నం పెట్టే భాండాగారంగా నిలిచిందని పేర్కొన్నారు.
దేశ జీడీపీలో నంబర్ స్థానంలో నిలిచిన రాష్ట్రం, కాంగ్రెస్ అవినీతి పాలనలో అధమ స్థానానికి పడిపోయిందని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత యువతరంపై ఉందన్నారు. నీతి నిజాయితీ గల నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ లో పదవులు అనుభవించిన నాయకులు స్వార్థ ప్రయోజనాలు, అధికార దాహంతో పార్టీలు మారి ప్రజలను మోసం చేశారని వారికి మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీకి ఇటీవల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వంపై కాంట్రాక్టర్ల కు నమ్మకం లేక పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణంలో రూ. 50 కోట్ల ప్రత్యేక నిధులతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. మద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ ను రూ. 3 కోట్లతో సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదం కలిగించేందుకు పర్యటకుల కోసం బోట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మినీ ట్యాంక్‌బండ్ ప్రస్తుతం మూలన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో కోరుట్ల నియోజకవర్గంకు నయా పైసా నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు.
కోరుట్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరవేసేందుకు యువతరం నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కోరుట్లను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు శాయశక్తుల కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నారాయణరెడ్డి, దారిశెట్టి రాజేష్, సాయినీ రవీందర్, పహీం, పేర్ల సత్యం, బట్టు సునీల్, గడ్డం మధు తదితరులు పాల్గొన్నారు.