MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, డిసెంబర్ 18: యువత ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలని, నూతన ఆవిష్కరణలతో ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. ఎమ్మెల్యే సహకారంతో కోరుట్ల, మెట్ పల్లి విద్యార్థులు హైదరాబాదులోని టీ హబ్, టీ వర్క్స్ ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో వివిధ బస్సుల్లో రెండు పట్టణాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు చెందిన విద్యార్థులను హైదరాబాద్ కు తీసుకెళ్లారు.
హైదరాబాద్‌లోని టీ-హబ్, టీ-వర్క్స్ సందర్శించిన విద్యార్థులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రపంచ స్థాయి టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడటం రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు. టీ-హబ్, టీ-వర్క్స్ లాంటి వేదికలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచి, భవిష్యత్తులో స్టార్టప్‌ల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తాయన్నారు. కోరుట్ల నియోజకవర్గ విద్యార్థులు ఈ వేదికల ద్వారా కొత్త ఆవిష్కరణలకు ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.
యువత డిగ్రీ పూర్తి చేయడమే లక్ష్యంగా కాకుండా నైపుణ్యాలు పెంచుకొని అవకాశాలను సృష్టించుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులు ఈ సందర్శనలో భాగంగా స్టార్టప్ ప్రాజెక్టులు, ఆధునిక టెక్నాలజీ విభాగాలు, ఇన్నోవేషన్ ల్యాబ్‌లు ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ అనుభవం భవిష్యత్తులో వారికి ఉపాధి అవకాశాలపై అవగాహన కలగడానికి దోహదపడనుండగా, విద్యార్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట కోరుట్ల నియోజకవర్గంలోని వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు, కరస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్ ఉన్నారు.