Thimmapur | తిమ్మాపూర్, నవంబర్17: చిన్ననాడే తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయినా.. తల్లి చిన్నా.. చితకా పనులు చేస్తూ పిల్లలను చదివిస్తున్నది. అంతా బాగుంది అనుకునే క్రమంలో కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీటి సంద్రమైంది. ఎల్ఎండీ పోలీసుల కథనం ప్రకారం.. తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన కళ్లెం అంజయ్య, రాజేశ్వరీలకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలున్నారు. అంజయ్య కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
కాగా అప్పటినుండి రాజేశ్వరి అన్ని అయి అండమాన్ నికోబార్ లో కూలీపనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నది. కొడుకు కళ్లెం శ్రీనివాస్(18) కరీంనగర్లో ఐటీఐ చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కరీంనగర్ వెళ్తుండగా రామకృష్ణకాలనీ లోని వాగేశ్వరి కళాశాల ముందు రాజీవ్ రహదారిపై శ్రీనివాస్ బైక్ను వెనుక నుండి లారీ అతివేగంగా ఢీకొట్టడంతో లారీ వెనుక టైర్ల కింద పడిపోయి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.
శరీర భాగాలు నుజ్జు నుజ్జు అయిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శ్రీనివాస్ మృతదేహాన్ని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ సోదరి రాధిక ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.