Kalvakuntla Vidyasagar Rao | కోరుట్ల, సెప్టెంబర్ 7: సామాజిక సేవతోనే యువతకు సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. పట్టణంలోని కింగ్స్ గార్డెన్ లో నిర్వహించిన కోరుట్ల సోషల్ సర్వీస్ సొసైటీ సామాజిక కార్యకర్తల సన్మానం కార్యక్రమంలో ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ యువత సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు.
కుల, మతాలకు అతీతంగా యువత కలిసికట్టుగా సమాజ శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడం అభినందనీయమన్నారు. సామాజిక సేవ అనేది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా సమాజ హితం కోరి చేసే గొప్ప కార్యమని పేర్కొన్నారు. కోరుట్ల సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు యువతకు స్పూర్తి దాయకంగా నిలవాలన్నారు. ఆపత్కాలంలో రక్తదానం అందిస్తూ ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందంజలో నిలుస్తున్న సొసైటీ సభ్యులను ఆయన అభినందించారు.
అనంతరం రక్త దాతలను ఆయన శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సొసైటీ నిర్వాహకులు అమీర్ ఖాన్, షో ఖాన్, నాయకులు సయ్యద్ ఫహీం, అన్వర్ సిద్ధికి, నయీమ్, నజీబుద్దిన్, ఇలియాస్ ఖాన్, మీర్జా ముక్రం, మహ్మద్ ఆతిక్, సుజాహిద్ తదితరులు పాల్గొన్నారు.