Godavarikhani | కోల్ సిటీ , ఏప్రిల్ 20: ఒకప్పుడంటే 50 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి గుండె జబ్బులు వచ్చేవని, కానీ ఇప్పుడు కాలం మారిందని, వయసుతో సంబంధం లేకుండానే చిన్నాపెద్ద, మగ, మహిళ అందరికీ గుండె జబ్బులొస్తున్నాయని, స్వీయ జాగ్రత్తలే ఏకైక మార్గమని కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ కార్డియాలజిస్టు అనీష్ పబ్బ అన్నారు.
గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియంలో ‘గుండె జబ్బులు-చికిత్స విధానం’ అనే అంశంపై ఆదివారం ‘హెల్త్ టాక్’ నిర్వహించగా దానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వాకర్స్, సింగరేణి కార్మిక, రిటైర్డ్ కార్మిక కుటుంబాలు, మహిళలు, యువతీ యువకులకు ఉచితంగా గుండె వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ అనీష్ మాట్లాడుతూ ప్రతి రోజూ క్రమం తప్పకుండా వాకింగ్, వామప్ చేసే వారు సైతం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
దూమపానం, మద్యపానం, ఫాస్ట్ ఫుడ్, నాన్ వెజ్ తీసుకోవడం, అధిక బీపీ, షుగర్ ఉన్న 30 యేళ్ల పైబడిన వారు రిస్క్ లో ఉన్నట్లే అని సూచించారు. తమ లైఫ్ స్టైలు పూర్తిగా మార్చుకొని అదుపులో పెట్టుకున్నవారే ఈ గుండె జబ్బుల దాడుల నుంచి తప్పించుకుంటారన్నారు. మానసిక, శారీరక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలనీ, స్వచ్ఛమైన ఆహార పదార్థాలు తీసుకోవాలనీ, మానసిక ప్రశాంతతో కూడిన జీవన విధానం అలవర్చుకోవాలని సూచించారు.
మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆస్పత్రి ఎమర్జెన్సీ ఫిజిషియన్ డాక్టర్ వేముల సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ ఎండీ ముస్తఫా, పెద్దెల్లి తేజస్వి ప్రకాశ్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల శ్రీనివాస్, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, హరీష్, యూనస్, రమేష్ తోపాటు అధిక సంఖ్యలో వాకర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.