హుజూరాబాద్ రూరల్, నవంబర్ 6 : ‘నీ కొడుకును కిడ్నాప్ చేసినం. వెంటనే 50 వేలు ఫోన్ పే చెయ్’ అంటూ హుజూరాబాద్ పట్టణ సమీపంలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన మాసాడి లక్ష్మణ్‌రావుకు పాకిస్థాన్‌కు చెందిన సిరీస్ నంబర్ నుంచి ఫేక్ కాల్ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన ఆయన హైబీపీతో దవాఖానలో చేరాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
లక్ష్మణ్‌రావు కొడుకు అమెరికాలో ఉంటున్నాడు. అయితే, ఈ నెల 2న లక్ష్మణ్‌రావుకు ఫేక్ కాల్ రావడంతో వెంటనే కొడుకుకు ఫోన్ చేశాడు. అక్కడ రాత్రి కావడంతో స్పందించ లేదు. దీంతో హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. మరోసారి ఫోన్ రావడంతో హై బీపీ వచ్చి పడిపోయాడు. పోలీసులు స్పందించి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం హన్మకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా, అక్కడే చికిత్స పొందుతున్నాడు.