హుస్నాబాద్‌కు చెందిన ఓ యువతి తెలిసో తెలియకో ఓ వ్యక్తిని ప్రేమించింది. అతనికి పెళ్లయిందని తెలిసి బాధపడ్డది. అప్పటికే గర్భం దాల్చింది. ఆ తర్వాత అతన్నే పెండ్లి చేసుకుంది. కానీ, ఇదంతా ఆమె కుటుంబ సభ్యులకు నచ్చలేదు. పుట్టింటికి తీసుకెళ్లి, అబార్షన్ చేయించుకోవాలని నచ్చజెప్పారు. జమ్మికుంటలో నిర్ధారణ పరీక్షలు చేసిన అనంతరం ఆ యువతిని హుజూరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించి అబార్షన్ చేశారు. ఈ భ్రూణహత్య కేసు ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతున్నది. తనకు బలవంతంగా అబార్షన్ చేయించారని ఇటీవల ఆ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు ఐదుగురిని, మరో ఇద్దరు మధ్యవర్తులను జైలుకు పంపారు. అబార్షన్ చేసిందెవరో తేల్చే పనిలో ఉన్నారు. అయితే ఎన్ని ఘటనలు జరుగుతున్నా జమ్మికుంట, హుజూరాబాద్ కేంద్రంగా భ్రూణహత్యల పర్వం కొనసాగుతూనే ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నది.
కరీంనగర్, జూలై 8 (నమస్తే తెలంగాణ)/జమ్మికుంట: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన ఓ యువతి అదే పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెండ్ల్లి చేసుకుంటామని నిర్ణయించుకుని సహజీవనం చేశారు. ఫలితంగా ఆమె గర్భందాల్చింది. తర్వాత పెళ్లి చేసుకున్నది. అయితే అతడికి ఇది వరకే పెళ్లయిన విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆ యువతిని పుట్టింటికి తీసుకెళ్లి నచ్చజెప్పారు. ఆమెకు ఎలాగైనా అబార్షన్ చే యించాలని మొదట ప్రయత్నించగా, ఆ యువతి అంగీకరించలే దు. అబార్షన్ తర్వాత మాట్లాడుదామని ఆమె కుటుంబ సభ్యులు నచ్చజెప్పారు. దీంతో భూపాలపల్లి జిల్లా చిట్యాలపల్లి మండలం టేకుమట్లకు చెందిన ఓ ఆర్ఎంపీని యువతి తల్లిదండ్రులు ఆశ్రయించారు.
ఆయన జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లాడు. అక్కడ గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన వైద్యులు, హు జూరాబాద్లోని మరో ప్రైవేట్ దవాఖానకు తరలించి అబార్షన్ చేశా రు. ఇప్పటి వరకు ఈ వ్యవహారం గుట్టుగానే సాగింది. అయితే కొద్ది రోజులకు తాను పెండ్లి చేసుకున్న వ్యక్తి వద్దకు తిరిగి వెళ్లిన ఆ యు వతి, జరిగిన విషయం అతనికి చెప్పింది. అంతటితో ఆగకుండా తనకు బలవంతంగా అబార్షన్ చేయించారని తన కుటుంబ సభ్యులతోపాటు ఆర్ఎంపీ డాక్టర్, వైద్యులపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి కుటుంబ సభ్యులు ఐదుగురితో పాటు టేకుమట్లకు చెందిన ఆర్ఎంపీని, జమ్మికుంటకు చెం దిన సదరు ప్రైవేట్ దవాఖాన పీఆర్వోను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
సదరు యువతికి అబార్షన్ చేయించినట్టు తమ నేరాంగీకార పత్రంలో నిందితులు ఒప్పుకొన్నట్టు హుస్నాబాద్ పోలీసులు చెబుతున్నారు. అయితే ఆర్ఎంపీ ఇచ్చిన నేరాంగీకర పత్రంలో మరో సంచలన విషయం బయటపడింది. ఈ కేసులో యువతి కు టుంబ సభ్యుల నుంచి 62 వేలు తీసుకున్నట్టు, అందులో 30 వేలు తాను ఉంచుకుని మిగతా 32 వేలు అబార్షన్ చేసిన హుజూరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడికి ఇచ్చినట్టు అంగీకరించారు. ఈ విషయాన్ని హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్ కూడా నిర్ధారించారు. హుజూరాబాద్‌కు చెందిన సదరు వైద్యుడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కూడా సీఐ తెలిపారు. నిజానికి ఈ అబార్షన్ చేసిందెవరనే విషయంలో స్పష్టత లేదు. కొంత కాలంగా జమ్మికుంట, హుజూరాబాద్ కేంద్రంగా భ్రూణహత్యల దారుణాలు పెరిగిపోతున్నాయి.
ఇక్కడ పనిచేసే వైద్యులు కాసులకు కక్కుర్తిపడి ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే కేసులో జమ్మికుంట ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తున్న పీఆర్వో ఏ డాక్టర్ పేరు చెప్పకుండా తానే అబార్షన్ చేశానని ఒప్పుకున్నట్టు తెలుస్తున్నది. అదే ఆర్ఎంపీ నేరాంగీకార పత్రంలో మాత్రం హుజూరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ వైద్యుడి పేరును వెల్లడించినట్లు తెలిసింది. ఈ రెండు విషయాల్లో పొంతన లేకపోవడంతో అసలు హుజూరాబాద్‌కు చెందిన వైద్యుడే అబార్షన్ చేశారా..? జమ్మికుంటకు చెందిన వైద్యుల ప్రమేయం ఏమైనా ఉన్నదా..? అనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మొత్తానికి ఈ భ్రూణ హత్య వ్యవహారం కరీంనగర్, భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాల్లో ఇపుడు చర్చనీయాంశంగా మారింది.