జగిత్యాల కలెక్టరేట్, మార్చి 17: స్నాప్ చాట్‌లో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారగా, యువకుడిని యువతి కుటుంబ సభ్యులు చితకబాదారు. ఈ విషయం ఠాణా దాకా వెళ్లడంతో ఇరు వర్గాలపై న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. జగిత్యాల టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన అభిమన్యు, కొడిమ్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి స్నాప్ చాట్‌లో పరిచయం ఏర్పడింది. అది కొద్దిరోజులకే ప్రేమగా మారింది.
యువతి కరీంనగర్‌లోని ఓ డిగ్రీ కాలేజీలో చదువుతున్నది. ఈ క్రమంలో ఇద్దరూ అప్పడప్పుడు బయట కలుసుకొని మాట్లాడుకునేవారు. ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో మందలించారు. ఫోన్ లాక్కున్నారు. మూడు రోజులుగా ఇద్దరూ మాట్లాడుకోవడం లేదు. ఈ క్రమంలో మంగళవారం కరీంనగర్‌లోని కళాశాలకు వచ్చిన ఆమెను అభిమన్యు కలిశాడు. ఇద్దరూ కలిసి జగిత్యాలకు వెళ్లారు.
కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్డుపై ఇద్దరు మాట్లాడుకుంటుండగా, యువతి కుటుంబీకులు అక్కడికి చేరుకుని యువకుడిని చితకబాదారు. ఘటనా స్థలానికి చేరుకున్న జగిత్యాల టౌన్ పోలీసులు అభిమన్యు, యువతితోపాటు ఆమె బంధువులను ఠాణాకు తరలించి ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అమ్మాయిని వారి బంధువులకు అప్పగించగా, పబ్లిక్‌లో న్యూసెన్స్ చేసినందుకు గాను ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్టు సీఐ కరుణాకర్ తెలిపారు.