Accident | పెద్దపల్లి రూరల్, మే22: బంధువులైన కుటుంబ సభ్యులు వారి గ్రామమైన లొంకకేసారంలో చేసుకుంటున్న బీరప్ప (బీరన్న) బోనాల పండుగ వేడుకలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ యువరైతు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం పెద్దపల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో రాఘవాపూర్, లొంకకేసారం గ్రామాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. బసంత్ నగర్ పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన ఎనుగుల జగన్ (25) రామగిరి మండలంలోని కల్వచర్ల సమీపంలోని లొంకకేసారం లో గల దగ్గరి బంధువుల ఇంటికి బీరప్ప(బీరన్న) బోనాల పండుగకోసం వెళ్తున్నట్లు కుటుంబసభ్యులకు, స్నేహితులకు చెప్పి తన ద్విచక్ర వాహనంపై బుధవారం రాత్రి లొంకకేసారం బయలు దేరి వెళ్తున్నాడు.
ఈ క్రమంలోనే జగన్ ను పెద్దపల్లి మండలం రంగాపూర్ వద్ద మంథని నుంచి పెద్దపల్లి వైపు వస్తున్న కారు ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా జగన్ బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో జగన్ కు తీవ్రగాయాలు కావడం రాత్రి పూట ఎవరూ అందుబాటులో లేకపోవడంతో అతడికి సకాలంలో వైద్యం అందని కారణంగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య నిఖితతో పాటు రెండున్నరేళ్లు, మూడు నెలల పసిగుడ్డుతో ఇద్దరు కూతుర్లున్నారు. మృతుడి తండ్రి ఎనుగుల కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బసంత్ నగర్ ఎస్ఐ కె.స్వామి తెలిపారు.
మృతుడి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరామర్శ..
పెద్దపల్లి మండలం రంగాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎనుగుల జగన్ మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వదవఖానలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సందర్శించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగన్ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబసభ్యులను ఓదార్చారు. దాసరి వెంట పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ ఎస్ నాయకులు, వివిద పార్టీల నాయకులు ఉన్నారు.