Godavarikhani | కోల్ సిటీ, డిసెంబర్ 14: గోదావరిఖని లక్ష్మీనగర్ కు చెందిన యువ ఇంజనీర్ తానిపర్తి భాను- మమత దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. వృత్తి రీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. మంచి ఆకర్షణీయమైన జీతం. జీవితం. కానీ కన్న ఊరును మాత్రం ఏనాడూ మరువలేదు. ప్రతీ ఏటా క్రమం తప్పకుండా గోదావరిఖనికి వచ్చి అయ్యప్ప మాలధారులకు భిక్ష నిర్వహిస్తుంటారు. దీనిలో భాగంగా గోదావరిఖనికి వచ్చిన ఆ యువ ఇంజనీర్ దంపతులు శ్రీ కోదండ రామాలయంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ముందుగా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం సుమారు 200 మంది అయ్యప్ప మాలధారులకు సొంత ఖర్చులతో భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ గురు స్వామి, అర్చకుల నుంచి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అంతేగాక ఏదైనా శుభకార్యం రోజున ఈ దంపతులు గోదావరిఖనికి వచ్చి ఇక్కడి అనాథ ఆశ్రమంలోని పిల్లల మధ్య రోజంతా గడపడమే గాకుండా వారికి కడుపునిండా భోజనం పెట్టి ఆకలి తీరుస్తుంటారు. రామగుండం నగర పాలక సంస్థ మాజీ వైస్ చైర్మన్ తానిపర్తి గోపాల్ రావు విజయలక్ష్మీ దంపతుల కుమారుడు భాను యువ ఇంజనీర్ గా ఎదిగినప్పటికీ ఈ ప్రాంతంను మాత్రం మరువకుండా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడవడం అభినందనీయమని ఆలయ అర్చకులు, గురుస్వాములు, అయ్యప్ప భక్తులు కొనియాడారు.