IAS school | కోల్ సిటీ, జనవరి 26 : ఉదయం పాఠశాలకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ వృథా ఖర్చులు చేయకుండా చిన్న వయసు పిల్లలు పెద్ద మనసు చాటుకున్నారు. విధి వంచితులైన అంధులైన వృద్ధులకు చేయూత అందించారు. గోదావరిఖని ఎల్బీ నగర్ లోని ఐఏఎస్ పాఠశాల చిన్నారులు. కంటి చూపు కోల్పోయిన సమాజంలో వృద్ధులకు ఆశ్రయం కోసం హైదరాబాద్ కు చెందిన సోచ్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ అనే స్వచ్ఛంద సంస్థ ఆశ్రమ భవనం నిర్మిచేందుకు విరాళాలు సేకరిస్తోంది.
వారి సమాజ సేవలో భాగస్వాములుగా ఐఏఎస్ పాఠశాల విద్యార్థులు తమ వంతుగా తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతోపాటు ఇతరుల వద్ద నుంచి విరాళాలు సేకరించగా తక్షణంగా వచ్చిన మొత్తం రూ.26,500ల నగదును సోమవారం ఫౌండేషన్ నిర్వాహకులకు అందించి ఉదారతను చాటుకున్నారు.
పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పిల్లలను ప్రశంసా పత్రాలు, పెన్నులను అందించి అభినందించారు. పాఠశాల డైరెక్టర్ పేరం హేమలత శ్రీకాంత్ విద్యార్థి దశ నుంచే విద్యార్థుల్లో సామాజిక సేవా ధృక్పథాన్ని అలపర్చే విధంగా ప్రోత్సహించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. క్రమశిక్షణతో ఎదిగి మానవత్వం చాటుతూ దేశ సేవ చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు సైతం బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు.