జగిత్యాల, జూన్ 15, (నమస్తే తెలంగాణ) : జగిత్యాల జిల్లా కలెక్టర్గా దాదాపు 16 నెలల పాటు పనిచేసిన షేక్ యాస్మిన్ బాషా పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. 2023 ఫిబ్రవరి ఒకటిన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఆమె తను పనిచేసిన కాలంలో ప్రభుత్వ నిర్దేశిత కార్యక్రమాలు, పథకాలను విజయవంతంగా అమలు చేశారు. గతేడాది తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. నవంబర్లో శాసనసభా ఎన్నికలను గతంలో జరిగినదానికి భిన్నంగా న్యాయ సమస్యలు, ఇతర చిక్కులు లేకుండా అత్యంత సాఫీగా నిర్వహించారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికలను సైతం విజయవంతంగా పూర్తి చేశారు.
అంతే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ, అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేయడంలో విజయం సాధించారు. ఆమె పాలనలో జిల్లాలోని ప్రతి మారుమూల పల్లెలను సైతం పరిశీలించారు. పలు సందర్భాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పథకాల అమలు కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు మార్గదర్శనం చేశారు. అధికారులు, ఉద్యోగుల అవినీతిపైనా ఆమె కఠిన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా మత సామరస్యానికి ప్రతీకగా పలు సందర్భాల్లో ఆమె తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. ధర్మపురి బ్రహ్మోత్సవాలను కనుల పండువలా జరిపారు. అనేక ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో జరిగిన కార్యక్రమాల్లో నేరుగా పాల్గొన్నారు. ఆమె ధార్మిక ఔన్నత్యానికి జిల్లా ప్రజలు ముగ్ధులయ్యారు.