Yaran subsidy | సిరిసిల్ల టౌన్, జనవరి 27 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేతకార్మికులను యజమానులుగా చేసేందుకు రూ.377కోట్లతో ఏర్పాటు చేసిన 50 వర్కర్ టూ ఓనర్ షెడ్లను పంపిణీ చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నదని, కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ విడుదల చేయాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా నేత కార్మికుల సంక్షేమానికి కనీసం ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదని మండిపడ్డారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సంజీవయ్యనగర్ లో ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘నేతన్నపై కాంగ్రెస్ సర్కారు చావుదెబ్బ’, ‘సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కాపాడుకుందాం’ అనే పేరుతో ఏర్పాటు చేసిన కరపత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భగా విలేకరులతో మాట్లాడుతూ పద్మశాలీల అభ్యున్నతి కోసం రాష్ట్ర బడ్జెట్ లోనే తొలిసారిగా బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1200కోట్లు కేటాయించిందని తెలిపారు. సిరిసిల్ల నేతన్నలకు కోట్లాది మీటర్ల బట్ట ఆర్డర్లను టెస్కో ద్వారా ఇచ్చిందని గుర్తు చేశారు. తద్వారా ప్రతి నేతకార్మికుడికి నెలకు రూ.15 వేల నుండి రూ.20వేల వరకు గౌరవప్రదమైన వేతనం లభించిందని గుర్తుచేశారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా నేతన్నకు చేయూత (థ్రిఫ్ట్) పథక నుండి 1801 మంది కార్మికులకు రూ.514కోట్లు, నూలు రాయితీ పథకం ద్వారా 5,374 మందికి రూ.37.15కోట్లు అందించిందన్నారు. నేత కార్మికుల రుణాలను రద్దు చేస్తూ రూ.370కోట్ల రుణమాఫీ చేసిందని, రైతు బీమా తరహాలో నేతకార్మికుల కోసం నేతన్న బీమా పథకం కింద 5వేల మందికి రూ.5 లక్షల భీమా సౌకర్యం కల్పించిందన్నారు. రూ.30కోట్లతో వందశాతం సబ్సిడీతో మగ్గాలను ఆధునీకరణ, టెక్స్టైల్ పార్క్ లోని పరిశ్రమలకు యాభై శాతం విద్యుత్ రాయితీ కింద రూ.24కోట్లు మంజూరు చేసిందన్నారు.
పద్మశాలీల సంక్షేమం కోసం 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ సంక్షేమ సంఘం భవనానికి రూ.5కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు అవుతున్నా వర్కర్ టూ ఓనర్ షెడ్ల పథకాన్ని అమలు చేయడం లేదని అగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా నేత కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీని మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికలలో సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు షఫీ, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.