జగిత్యాల, సెప్టెంబర్ 16: రోగులకు అల్పాహారం కింద అందించిన అటుకుల్లో లక్క పురుగులు రావడం కలకలం జగిత్యాల ఎంసీహెచ్‌లో రేపింది. రోగులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని మాతాశిశు కేంద్రంలో ఇన్‌పేషంట్లు, వారి సహాయకులకు రోజూ పాలు, బ్రెడ్, అల్పాహారంతోపాటు మధ్యాహ్నం భోజనం అందిస్తారు. అయితే సోమవారం ఉదయం లక్క పురుగులున్న అటుకులు పెట్టడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మరీ ఇంత అధ్వానమా..? ఇదేట్లా..? తింటం’ అని మండిపడ్డారు. నాలుగు రోజులుగా నాసిరకం అల్పాహారం, ఉడికీ ఉడకని అన్నం అందిస్తున్నారని, తినలేకపోతున్నామని, ఒక వేళ తింటే వాంతులు, విరేచనాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నాణ్యమైన అల్పాహారం, అన్నం అందించాలని ఇటీవల దవాఖాన సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసినా, సదరు కాంట్రాక్టరు పట్టించుకోవడం లేదని వాపోయారు. పైగా సోమవారం పురుగుల టిఫిన్ పెట్టాడని, రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని..? మీడియాకు సమాచారం అందించారు. ఈ విషయమై సదరు కాంట్రాక్టరుకు ‘నమస్తే తెలంగాణ’ ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు.
ఆరోగ్యం బాగాలేకపోతే నాలుగు రోజుల కింద ఎంసీహెచ్‌కు వచ్చిన. ఇక్కడ పెట్టే అల్పాహారం, అన్నం మంచిగ ఉంటలేదు. ఈ రోజు పొద్దున పెట్టిన అటుకులు తినరాకుండా ఉన్నాయి. లక్క పురుగులు పారుతున్నాయి. మరీ ఇంత అధ్వానమా..? పాణం బాగ లేక దవాఖానకు వత్తే మళ్లీ పాణం తీసే పనులు చేస్తున్నరు.
– వెంకటమ్మ, రోగి
మా పాపకు జ్వరం వచ్చింది. వారం రోజుల కింద జగిత్యాల దవాఖానకు వచ్చినం. ఇప్పటికీ జ్వరం తగ్గలేదు. ఇక్కడ రోగులకు అందించే అల్పాహారం, భోజనం మంచిగ ఉంటలేదు. ఇయ్యాళ ఉదయం పెట్టిన అటుకుల్లో లక్క పురుగులున్నయి. ఎట్ల తింటం. ఇదేందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకుంటలేరు.
– రజిత, రోగి తల్లి