కోల్సిటీ, జూన్ 15 : అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని చిదిమిన కామాంధుడికి ప్రజా కోర్టులో ఉరి శిక్ష విధించాలని మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో జరిగిన బాలికపై లైంగికదాడి, హత్యకు నిరసనగా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో శనివారం కామాంధుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ, గంజాయి మత్తులో ఓ మానవ మృగం ఆరేళ్ల బాలికపై లైంగికదాడి చేసి, ఆపై హత్య చేయడం యావత్తు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.
విచ్చలవిడిగా గంజాయి మత్తు పదార్థాల విక్రయాలు జరుగడం వల్లే ఇలాంటి ఘోర ఘటనలు జరుగుతున్నాయని, దీనికి బాధ్యులెవరని ప్రశ్నించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను అరికట్టలేని అసమర్థత ఎవరిదని ప్రశ్నించారు. ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా పోతున్నదన్నారు. ఇలాంటి లైంగికదాడులు, హత్యలను అరికట్టాలంటే ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాలిక కుటుంబానికి రైస్ మిల్లు యాజమాన్యంతోపాటు ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలన్నారు. ధర్నాలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేశ్, మహిళా సభ్యులు కంది సుజాత, మేడగోని స్వప్న, మందల రమాదేవి, సరిత, లక్ష్మి, పిట్టల చంద్రకళ, బోగె లత పాల్గొన్నారు.