Korutla | కోరుట్ల, జనవరి 7: మహిళలు అక్షరజ్ఞానం కలిగి ఉండాలని, అప్పుడే కుటుంబంతో పాటు సమాజంలో గుర్తింపు వస్తుందని మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ స్త్రీ శక్తి భవనంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అమ్మకు అక్షరమాల (ఉల్లాస్) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనా ఆయన వయోజన విద్య ప్రాముఖ్యత, అందరికి విద్య ప్రాధాన్యం, వయోజన విద్యతో కలిగే ప్రయోజనాలు, నిరాక్షరాస్యతతో కలిగే సమస్యలు, మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలపై శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ మహిళలు చదవడం, వ్రాయడం నేర్చుకొని అందరికి ఆదర్శంగా నిలవాలన్నారు.
అక్షరాస్యతతోనే మహిళా సాధికారత సాధ్యం కాగలదని పేర్కొన్నారు. వాలంటీర్ల సహకారంతో ప్రతి మహిళా అక్షరాలు నేర్చుకోవాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించేలా అక్షర జ్ఞానం పొందాలని పేర్కొన్నారు. కోరుట్ల మహిళా సంఘాల్లో 591 మంది నిరక్షరాస్య మహిళలు ఉన్నట్లు ఆయన తెలిపారు. అనంతరం సీఆర్పీలు మాధవిలత, స్రవంతి మాట్లాడుతూ మహిళలకు చదవడం, వ్రాయడం సులువైన పద్దతిలో బోధనకు మార్గదర్శిని పుస్తకాన్ని అనుసరించాలని తెలిపారు. మహిళలు చదవడం, వ్రాయడం నేర్చుకొనుటకు అక్షర వికాసం పుస్తకం ఉపయోగపడుతుందని వివరించారు. కార్యక్రమంలో మెప్మా డీఎంసీ సునీత, టీఎంసీ శ్రీరామ్ గౌడ్, సీవోలు గంగారాణి, సంధ్య, మహిళ సమాఖ్య ప్రతినిధులు, మెప్మా రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.