కరీంనగర్, జనవరి 22 (నమస్తే తెలంగాణ)/గంగాధర : ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామ సభల్లో పాల్గొనేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మొదట తిమ్మాపూర్ మండలం రేణికుంటకు వచ్చారు. సభలో పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా నారాయణపూర్ రిజర్వాయర్ వద్దకు వెళ్లి పరిశీలించారు. విషయం తెలుసుకున్న నారాయణపూర్, దీని శివారు గ్రామం ఇస్తారిపల్లెకు చెందిన ముంపు బాధితులు తమ బాధలు చెప్పుకుందామని రిజర్వాయర్ కట్టపైకి వచ్చేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. మంత్రులు అక్కడి నుంచి నారాయణపూర్ గ్రామసభకు వచ్చారు. ఉత్తమ్ మాట్లాడుతుండగా, నారాయణపూర్, ఇస్తారిపల్లె గ్రామానికి చెందిన మహిళలు ఒక్కసారిగా లేచి కేకలు వేశారు. తాము నారాయణపూర్ రిజర్వాయర్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని, రిజర్వాయర్ నిండినప్పుడల్లా కంటిమీద కునుకు ఉండడం లేదని, ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయాందోళన చెందుతున్నామని వాపోయారు. తమ గ్రామాలను తక్షణమే ముంపు గ్రామాలుగా ప్రకటించి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటిస్తామని చాలా మంది ఇలాగే చెప్పి వెళ్లారని, తిరిగి రాలేదని నిలదీశారు.
మరోసారి కేకలు వేశారు. నిర్వాసితులకు పరిహారం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. దీంతో మంత్రి ఒకింత అసహనానికి గురయ్యారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతుండగా ప్రశ్నించిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా కుర్చీల్లో కూర్చోబెట్టారు. కేకలు వేస్తున్న మహిళల వద్దకు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, జడ్పీ సీఈవో శ్రీనివాస్ వెళ్లి మాట్లాడి సముదాయించడానికి ప్రత్నించారు. చివరగా నారాయణపూర్‌ను ముంపు గ్రామం కింద తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు. అధికారుల అత్యుత్సాహమో, కాంగ్రెస్ నాయకుల బల ప్రదర్శనో తెలియదుగానీ స్థానికులు మాత్రమే రావాల్సిన నారాయణపూర్ సభకు గంగాధర మండల వ్యాప్తంగా స్వశక్తి సంఘాల మహిళలను పెద్ద సంఖ్యలో తరలించడం విమర్శలకు దారి తీసింది. మంత్రుల టూర్ నేపథ్యంలో నారాయణపూర్‌కు చెందిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, ఇతర మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీల నాయకులను పోలీసులు ముందుగానే అరెస్ట్ చేసి గంగాధర పోలీసు స్టేషన్లో నిర్బంధించడం విమర్శలకు తావిచ్చింది.