ఆటోడ్రైవర్ల బతుకు ఆగమైంది. ఉపాధి లేక.. ఇల్లు గడవక కుటుంబాల్లో ఆకలి కేక వినిపిస్తున్నది. ప్రయాణికుల చేరవేతతో దశాబ్ధాలుగా ఏ రంది లేకుండా జీవించిన కార్మికుల కుటుంబాలపై ఆరు నెలల కింద కాంగ్రెస్ సర్కారు తెచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీవ్ర ప్రభావాన్ని చూపింది. వారి ఉపాధికి గండికొట్టింది. గత డిసెంబర్ ముందు వరకు ఆటో నిండా ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చుతూ రోజుకు రూ.వెయ్యి సంపాదించగా, ప్రస్తుతం తిండి ఖర్చుల మందం రాని దైన్యం కనిపిస్తున్నది.
ఈఎంఐలు సైతం కట్టలేకపోతుండడంతో ఫెనాన్సోళ్లు ఆటోలు లాక్కెళ్లుతున్నయని, ఎలా బతకాలో అర్థం కావడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. తమ పిల్లల చదువును సైతం నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి త్వరగా చూపకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన చెందుతున్నారు.
కరీంనగర్, మే 23 (నమస్తే తెలంగాణ): ఎలాంటి జీవనోపాధి లేని ఎందరో యువకులు ఆటోను ఆధారం చేసుకుని జీవితాలు గడుపుతున్నారు. దశాబ్ధాల తరబడి ఇదే వృత్తిలో తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. పిల్లలను చదివించుకుంటున్నారు. ఉన్నంతలో గొప్పగా బతికేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు లేక ఎందరో విద్యావంతులు సైతం ఇదే వృత్తిని ఎంచుకుని తమ కాళ్లపై తాము నిలబడ్డారు.
ఆరు నెలల వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత పరిస్థితి మారింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రోడ్డు టాక్స్‌లు రద్దు చేసి ఈ వృత్తిని ప్రోత్సహించింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ఆటో డ్రైవర్ల వృత్తికి ఉరితాడు బిగించింది. ఆటో నడుపుకొంటేనే పొట్టగడిచే కుటుంబాలు ఇప్పుడు దిక్కులేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకప్పుడు అలా వచ్చి రోడ్డపై నిలబడగానే నిమిషాల్లో నిండే ఆటోలు ఇప్పుడు గంటల తరబడి నిలబడినా సరిపడే ప్రయాణికులు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆటోల్లో ఎక్కువగా ప్రయాణించే మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయం ఉన్న ఆర్టీసీ బస్సుల కోసమే ఎదురు చూస్తుండగా, ఆటోవాలాలు బిక్కమొహాలతో ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది.
ఆరు నెలలుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతున్న ఆటోవాలాలు చివరకు పిల్లలను చదివించుకోలేని దుస్థితి వచ్చింది. శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన మొలుగూరి సంపత్ ఉదంతమే అందుకు ఓ ఉదాహరణ. తన ఇద్దరు కొడుకులను కేశవపట్నంలోని మోడల్ స్కూల్లో చదిస్తున్నాడు. ఇంటర్ వరకు ఇక్కడే చదువుకున్న సంపత్ కొడుకు ఒకరు ఇప్పుడు డిగ్రీ కోసం ఇటు కరీంనగర్‌కో, అటు హుజూరాబాద్కో వెళ్లాలి.
కానీ, ఆటో నడవక పోవడంతో సంపత్ కుటుంబాన్ని పోషించడమే భారంగా మారింది. ఆరు నెలల కింద కరీంనగర్ నుంచి తాడికల్‌కు నాలుగైదు ట్రిప్పులు వేసే సంపత్‌కు ఇపుడు ఒక ట్రిప్పు ప్రయాణికులు దొరకడమే కష్టంగా మారింది. వచ్చిన డబ్బులు డీజిల్ ఖర్చులు పోనూ వంద, 200 కూడా చేతిలో మిగలడం లేదు. ఈ పరిస్థితుల్లో తన కొడుకును డిగ్రీ ఎలా చదివియ్యగలని సంపత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన కొడుకు చదువు ఆపేసి ఏదైనా పనిలో పెడతానని వాపోయాడు. ఇప్పుడు అనేక మంది ఆటో డ్రైవర్లు సంపత్లాగే నిస్సహాయ స్థితిలో కనిపిస్తున్నారు.
ఆటోలు నడవకపోవడంతో చాలా మంది తమ కుటుంబాలను పోషించుకునేందుకు అప్పులు చేస్తున్నారు. కొందరికి అవి కూడా పుట్టడం లేదని, బతుకులు వెల్లదీయడం దినదిన గండంగా మారిందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. పెండ్లిళ్లకు ఎదిగిన ఆడ పిల్లలున్న ఆటోడ్రైవర్ల పరిస్థితి మరీ దారుణంగా మారిందని, పిల్ల ల పెండ్లిళ్లు చేసే పరిస్థితులు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆటో డ్రైవర్లు గుండె పోటుకు గురై మరణిస్తుండగా.. మరి కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
కరీంనగర్‌లోని కేడీసీసీబీ ప్రధాన బ్రాంచ్ ఎదుట ఆటో నంబర్-2 అడ్డా ఒకప్పుడు నిత్యం వచ్చే పోయే ప్రయాణికులతో, ఆటోల సందడితో కిటకిటలాడేది. మానకొండూర్, తిమ్మాపూర్, చిగురుమామిడి, గన్నేరువరం, బెజ్జంకి, శంకరపట్నం తదితర మండలాలకు సంబంధించిన 60 నుంచి 70 గ్రామాల ప్రజలకు ఇక్కడ క్షణాల్లో ఆటోలు దొరికేవి. ఈ మండలాల్లో ఏ గ్రామానికి వెళ్లాలన్నా, ఎప్పుడొక ఆటో అందుబాటులో ఉండేది. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.
బస్సులు నడవని సమయంలోనే మహిళా ప్రయాణికులు ఆటోల కోసం ఇక్కడికి వస్తున్నారు. కొద్దిపాటిగా అందుబాటులో ఉన్న ఆటోలు వారిని ఎక్కించుకుని గంటల కొద్ది నిరీక్షిస్తున్నాయి. ఆటో నిండితే తప్పా ముందుకు సాగని పరిస్థితి. మానకొండూర్ మండలం లింగాపూర్‌కు చెందిన పిట్టల కుమార్ మంగళవారం ఉదయం 9 గంటలకు తన ఊరి నుంచి నలుగురు ప్రయాణికులతో కరీంనగర్‌కు వచ్చాడు. మనిషికి 40 చొప్పున చార్జి తీసుకుని తిరిగి వెల్ధికి వెళ్లేందుకు ఈ స్టాండ్ వద్ద ఆటో నిలిపాడు.
మధ్యాహ్నం 2 గంటల వరకు 8 మంది ప్రయాణికులు దొరికారు. ఆ సమయంలో లింగాపూర్‌కు బస్సు లేక పోవడంతో కుమార్ అదృష్టం బాగుండి నాలుగురైదుగురు మహిళా ప్రయాణికులు కూడా దొరికారు. ఇదే కుమార్ ఆరు నెలల కింద లింగాపూర్ నుంచి కరీంనగర్‌కు రోజుకు ఐదారు ట్రిప్పులు వేసేవాడు. ఇప్పుడు ఒక్క ట్రిప్పు కూడా వేయలేని పరిస్థితి ఉందంటే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతోనే తమకు ఇబ్బందులు మొదలయ్యాయని ఆటో డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. ఆటోల్లో ఎక్కువగా ప్రయాణించేది మహిళలేనని, అందువల్లే తమకు గిరాకీ తగ్గిందని వాపోతున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపితేనే తమ బతుకులు తిరిగి గాడిన పడుతాయని చెబుతున్నారు. తమకు ఏడాదికి 12 వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వ లేదని మండిపడుతున్నారు.
అవి ఇచ్చినా తమకు ఏ మాత్రం సరిపోవని, రేవంత్ రెడ్డి ఇచ్చే డబ్బులు రోజుకు 33 మాత్రమే పడతాయని, అవి మాకెందుకని ప్రశ్నిస్తున్నారు. కొత్తగా ఆటోలు కొనుక్కున్న వాళ్లు ఈఎంఐలు చెల్లించలేక పోతున్నారని, ఫైనాన్స్ కంపెనీలు అనేక మంది ఆటోలను లాక్కెల్లాయని వారు చెబుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని, లేదంటే తమ బతుకులు మరింత ఆగమైతాయని ఆటోడ్రైవర్లు ముక్త కంఠంతో స్పష్టం చేస్తున్నారు.
ఆరు నెలల కింద రోజుకు ఐదారు ట్రిప్పులు కొట్టెటోన్ని. డీజిల్ పైసలుపోను రోజుకు వెయ్యి పన్నెండు వందలు మిగిలేటియి. అప్పుడు ఇట్ల రోడ్డెక్కంగనే అట్ల ప్యాసింజర్లు ఎక్కెటోళ్లు. నలుగురైదుగురు ఆటోల కూసోంగనే బయలుదేరెటోన్ని. పోంగ పోంగ స్టేజీల దగ్గర ప్యాసింజర్లు దొరికెటోళ్లు. ఆటోల జాగ లేదని అప్పుడు ఆపెటోళ్లను కూడా వదిలేసి పొయెటోన్ని.
ఇప్పుడు గ్యారంటీ లేని బతుకైపోయింది మాది. కనీసం ఎనిమిది మంది ఉంటెనే ఆటో కదిలిస్తన్నం. మధ్యల ఎక్కెటోళ్లు ఉంట లేరు. అప్పుడు రోజుకు లింగాపురం నుంచి కరీంనగర్‌కు ఐదారు ట్రిప్పులు వేసెటోన్ని. ఇపుడు ఒక్క ట్రిప్పు ఏసుడు కష్టమైతంది. పొద్దున తొమ్మిది గంటలకు ఇంట్లకెల్లి వచ్చిన. ఇప్పుడు మధ్యాహ్నం రెండు అయితంది. కొందరు దొరికిన్రు. ఇవి మా బతకులు. రాను రాను ఇంక అధ్వానం అయ్యెతట్టున్నది.
– పిట్టల కుమార్, లింగాపూర్ (మానకొండూర్ మండలం)
మాది మానకొండూర్ మండలం వెల్ది. కరీంనగర్‌కు 20 కిలో మీటర్లు ఉంటది. అక్కడి నుంచి ఒక్క ట్రిప్పు వెయ్యాల్నంటే నూటాయాభై రూపాయల డీజిల్ కాలుతది. కనీసం ఎనిమిది మంది ఉంటే ట్రిప్పుకో వంద, రెండు వందలు మిగిలేది. అపుడు నాలుగైదు ట్రిప్పులు కొట్టేది. ఇపుడు గిరాకే లేకుంట వాయే. రూపాయి మిగుల్తలేదు. ఇంట్ల ఆటో పెట్టుకుని ఉంటె ఎట్లని రోడ్డు మీదికి వస్తే మా పరిస్థితి గిది. నాకు ఇద్దరు పిల్లలు. భార్య ఇంట్లనే ఉంటది. ఆటో మీదనే బతుకాలే. పిల్లల చదువులెట్ల? ఇల్లు గడుసుడెట్ల? ఆడోళ్లకు ఫ్రీ బస్సు అయినకాంచే మా బతుకులు ఆగమైనయి.
– ఆర్ సంతోష్‌కుమార్, వెల్ది
మా పరిస్థితి చాన దారుణంగున్నది. నేను పదమూడేండ్ల సంది ఆటో నడుపుతున్న. ఇసొంటి పరిస్థితి ఎప్పుడు చూడలే. ఆటో నడుస్తెనే మాకు పూట గడుసుడు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. భార్య ఇంటి కాన్నే ఉంటది. ఇన్నాళ్లు ఆటో మంచిగ నడిచినప్పుడు ఏ కష్టం అనిపియ్యలే. ఒకప్పుడు రోజుకు వెయ్యికి తక్కువ సంపాదించకపోదుం. ఈ ఆరునెల్ల సంది గిరాకీ దొరుకుత లేదు. దొరికినా డీజిల్ ఖర్చులు పోనూ వంద రెండొందలు మిగులుతున్నయ్. ఇల్లు గడుసుడు కష్టమైతంది. ఇట్లయితే ఎట్ల బతుకుడో తలుచుకుంటెనే భయమైతంది. నా బిడ్డ ఇపుడు యూకేజీ చదువుతంది. కరీంనగర్ ప్రైవేట్ స్కూళ్ల ఏసిన. పోయిన ఏడాది 18 వేలు కట్టిన. ఇపుడు రూపాయి చేతిల లేదు. నా బిడ్డ చదువెట్లనో అర్థమైత లేదు.
– దాడి అనిల్, లింగాపూర్ (మానకొండూర్ మండలం)
ఆటోలు నడిచినప్పుడు మంచిగనే బతికినం. నాకు ఇద్దరు కొడుకులు. ఇద్దరినీ కేశవపట్నం మోడల్ స్కూల్ల చదివిస్తన్న. ఒకనిది ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు డిగ్రీకి చదివియ్యాలే. ఇంకొకడు టెన్త్ పాసైండు. వాన్ని మోడల్ స్కూళ్లనే చదివిస్త. డిగ్రీ చదివెటోని పరిస్థితితే అర్థమైత లేదు. ఆటో నడిస్తే చదివిచ్చెటోన్నే. ఇప్పుడు ఆటో నడుస్తలేకపాయే. ఇల్లు గడుసుడే కష్టంగావట్టే. పోరగాండ్లను యాడికెళ్లి చదివియ్యాలే. అందుకే వాని చదువాపి ఏదైనా పనిలో పెడత. ఇంటికి ఇంత ఆసరైతడు. మరేం చేద్దాం. మా బతుకులు ఇట్ల తయారైనయ్.
– మొలుగూరి సంపత్, తాడికల్ (శంకరపట్నం)