కోల్ సిటీ, ఆగస్టు 8: రావమ్మా… మహాలక్ష్మీ రావమ్మా… అంటూ అష్ట లక్ష్మీదేవతలను మహిళా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచారు. శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పర్వదినం పురస్కరించుకొని గోదావరిఖనిలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. స్థానిక ప్రధాన కోదండ రామాలయంకు మహిళా భక్తులు పోటెత్తారు. విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం కన్నుల పండువగా నిర్వహించారు.
ఆలయ కార్యనిర్వహణ అధికారి ముద్దసాని శంకరయ్య నిర్వహణలో జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వీ.హెచ్. పి క్షేత్ర సంఘటన మంత్రి (మూడు రాష్ట్రాల కార్యదర్శి) గుమ్మళ్ల సత్యం జీ ముఖ్యతిథిగా హాజరై మన సంస్కృతీ, సంప్రదాయం, హైందవ ధర్మాన్ని కాపాడుకోవడం మన లక్ష్యమనీ, ప్రతి మహిళ తమ ఇంట్లోని పిల్లలకు హిందూ ధర్మాల గురించి నేర్పించాలని సూచించారు. అన్యమతస్థుల ఆచార విధానాలు పిల్లలపై ప్రభావం చూపకుండా జాగ్రత్తలు వహించాలన్నారు.
అనంతరం ఆలయ ప్రధాన పూజారి గోవర్ధనగిరి మధుసూదన చార్యులు, శశిధర చార్యులు మంత్రోచ్ఛారణల మధ్య మహిళలు నియమ నిష్టల మధ్య భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం ఆచరించారు. పారిశ్రామిక ప్రాంతం నుంచి అశేష సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చారు. అలాగే నగరంలోని పలు దేవాలయాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటింటా మహిళలు వరలక్ష్మీ వ్రతం పూజలు చేసి ఇరుగుపొరుగు వారిని పిలిచి వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ గట్ల రమేష్ తోపాటు పూజారులు, సిబ్బందితోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.