Car Accident | చిగురుమామిడి, మే 11: స్నేహితురాలి వివాహానికి వచ్చి అనంతరం వెళ్లేందుకు రోడ్డు పక్కన ఉన్న మహిళ ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. వివరాల్లోకి వెళితే మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఆదివారం వివాహం జరగగా, వివాహనంతరం ఊరు బయటగల ఒక ఫంక్షన్ హాల్ లో విందును ఏర్పాటు చేశారు.
వివాహానికి హాజరై భోజనం అనంతరం బస్ కోసం ఎదురుచూస్తున్న పెళ్లికూతురు స్నేహితురాలు జగిత్యాల జిల్లా జాబితాపూర్ కు చెందిన మౌనిక (23) ను హుస్నాబాద్ నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పక్కనే ఉన్న గోదావరిఖని కి చెందిన సంతోష్ కు గాయాలయ్యాయి.
సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలాన్ని తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్, ఎస్సై చందబోయిన శ్రీనివాస్, ట్రైనింగ్ ఎస్సై జగదీశ్వర్ పరిశీలించారు. వారిని వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి బంధువులకు సమాచారమందించినట్లు పోలీసులు తెలిపారు.