కరీంనగర్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): వైన్స్షాపుల లక్కీ డ్రా ఉత్కంఠభరితంగా సాగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం లాటరీ పద్ధతిలో డ్రా నిర్వహించగా, ఆద్యంతం టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఈ సారి దరఖాస్తు ఫీజు 3లక్షలకు పెంచినా.. పోటాపోటీ కనిపించింది. ఎన్నోఆశలతో టెండర్లలో పాల్గొన్న వారిలో కొందరిని అదృష్టం వరించగా, మరికొందరికి నిరాశే మిగిలింది. 2025-27 రెండేండ్లకుగానూ కరీంనగర్ జిల్లాలో 94 దుకాణాలకు 2,730 దరఖాస్తులు, పెద్దపల్లి జిల్లాలోని 74 షాపులకు 1,507, జగిత్యాల జిల్లాలోని 71 షాపులకు 1966, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 48 షాపులకు 1381 అర్జీలు వచ్చిన విషయం తెలిసిందే.
కరీంనగర్లో కలెక్టర్ పమేలా సత్పతి అధ్యక్షతన, పెద్దపల్లి జిల్లాలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ, జగిత్యాలలో కలెక్టర్ సత్యప్రసాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ అధ్యక్షతన లాటరీ పద్ధతిలో డ్రా తీసి మద్యం దుకాణాలు కేటాయించి, లైసెన్స్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, లైసెన్స్ ఫీజులో 1/6 వంతు మంగళవారం చెల్లించాల్సి ఉంటుందని, లేదంటే ఉత్తర్వులు రద్దు చేసి మరో సారి దరఖాస్తులు ఆహ్వానిస్తామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.